పార్టీ బలోపేతం కోసం డీఎంకే మాదిరిగా బీఆర్ఎస్

0
202 Views

అనంతగిరి డెస్క్:తెలంగాణలో బలమైన స్థానిక రాజకీయ పార్టీగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న బీఆర్‌ఎస్ (భారత రాష్ట్ర సమితి) ప్రస్తుతం గ్రామ స్థాయిలో తనను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో దేశ రాజకీయాల్లో ప్రభావం చూపిన ప్రాంతీయ పార్టీలను అధ్యయనం చేయాలని భావిస్తోంది.ఇందులో భాగంగా, తమిళనాడులో ప్రధాన ప్రాదేశిక రాజకీయ శక్తిగా నిలిచిన ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ నిర్మాణం, నిర్వహణ పద్ధతులను బీఆర్ఎస్ పరిశీలిస్తోంది. డీఎంకే తరహాలోనే బీఆర్‌ఎస్ కూడా ఉద్యమ పార్టీ కావడంతో, ఈ రెండు పార్టీల మధ్య సిద్దాంతపరమైన పోలికలు ఉన్నాయని బీఆర్ఎస్ భావిస్తోంది.డీఎంకే పార్టీ తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎదుర్కొన్న ఆటుపోట్లను ఎలా అధిగమించిందనే అంశాన్ని బీఆర్ఎస్ లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ ప్రయోజనాల కోసం, కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ సీనియర్ నేతల బృందం సెప్టెంబరులో చెన్నై పర్యటన చేయనుంది. ఈ బృందం వారం రోజుల పాటు డీఎంకే సంస్థాగత నిర్మాణంతో పాటు ఇతర కీలక అంశాలను అధ్యయనం చేయనుంది.

ఈ నేపథ్యంలో, పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నేతృత్వంలో ఆంజనేయ గౌడ్, తుంగ బాలు వంటి యువ నాయకులు ఇటీవల చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం ‘అన్నా అరివాలయం’ను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.