జిల్లా గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి: జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి

0
20 Views

వికారాబాద్:వికారాబాద్ జిల్లాలో భాషా సాహిత్య రంగాలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ సి. నారాయణరెడ్డి తెలిపారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఇటీవల ప్రచురించిన వికారాబాద్ జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథాన్ని పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య సోమవారం కలెక్టర్ కు అందజేసి సత్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అత్యంత క్రియాశీలంగా సాగుతున్నామని, ఇకపై భాషా సాహిత్యాలకు కూడా తగిన ప్రోత్సాహం అందిస్తామని అన్నారు. ఇప్పటివరకు పూర్వపు రంగారెడ్డి జిల్లాలో భాగంగా ఉన్న వికారాబాద్ జిల్లా ఈనాడు అన్ని రంగాల్లో తన ప్రతిభను చాటుకుంటున్నదని, ఈ అంశాలపై తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రచురించిన గ్రంథాన్ని అందరికీ అందించే ఏర్పాటు చేస్తామని నారాయణరెడ్డి హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తమ జిల్లా గొప్పదనం గురించి తెలుసుకోవాలని ఆయన సూచించారు. పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ చెన్నయ్య మాట్లాడుతూ నిజాం కాలంలో 80 సంవత్సరాల కిందట వెలసిన సారస్వత పరిషత్తు తెలుగు భాషా పరిరక్షణకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నదని తెలిపారు. తెలంగాణ 33 జిల్లాల చరిత్ర, సంస్కృతి, భాషా సాహిత్యాలు కళలు మొదలైన అంశాలపై సమగ్ర గ్రంథాలను వెలువరిస్తుందని, ఇప్పటికీ 16 జిల్లాలు పూర్తయ్యాయని వివరించారు. ఈ గ్రంథాన్ని రూపొందించడంలో పరిషత్తుకు తోడ్పడిన అవధాని అంజయ్య ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి పై ఆశువుగా పద్యాన్ని ఆలపించారు.