సర్పంచుల పనితీరు భేష్‌..గ్రామాల అభివద్ధిలో వారి కృషి అమోఘం:జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ పట్నం సునీతారెడ్డి

0
22 Views

వికారాబాద్‌ : జిల్లాలో ఐదేళ్ల పదవీ కాలంలో గ్రామాల అభివృద్ధికి సర్పంచులు చేసి కృషి మరువలేనిదని జడ్పీ చైర్‌ పర్సన్‌ పట్నం సునీతారెడ్డి అన్నారు. వారి పనితీరు చాలా బేషుగ్గా ఉందని కొనియాడారు. జిల్లాలో చాలా మంది సర్పంచులు తమ గ్రామాల అభివృద్ధి కోసం తమ సొంత భూములు అమ్ముకున్నారని, మరి కొందరు అప్పుటు చేసి పనులు చేశారని అన్నారు. రేపటితో సర్పంచుల పదవీకాలం ముగుస్తునందున బాగా కష్టపడి పనిచేసిన సర్పంచులందరికీ పత్రికా ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. అలాంటి సర్పంచులకు సంబంధిత ఇంజినీర్లు, పంచాయతీ అధికారులు ఎంబీరికార్డులు చేసి ఇవ్వాలని అధికారులకు సూచించారు. వీరికి పెండింగ్ బిల్లుల చెల్లింపుపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసికెళ్లినట్లు గుర్తుచేశారు. ఎంతో మంది కష్టపడి గ్రామాలను ఉన్నతంగా తీర్చిదిద్దారని, కొన్ని గ్రామాల సర్పంచులు అప్పటి ఎమ్మెల్యేల అండతో అక్రమాలకు పాల్పడినట్లు మండిపడ్డారు. అలాంటి వారికి తన మద్ధతు ఉండదని స్పష్టం చేశారు. బషీరాబాద్‌ మండలం బాద్లాపూర్‌ సర్పంచ్‌ నీలిభాయి అభివృద్ధి చేసి అప్పుల పాలైతే అడ్డమీద కూలీ పనిచేయడం తనను ఎంతగానో బాధించిందని అన్నారు. ఇలాంటి సర్పంచ్ లు ఎంతో మంది ఉన్నారూ. ఇలా చాలా మంది సర్పంచులు కూలీ పనులు, వ్యవసాయ పనులు చేశారన్నారు. గ్రామం అభివృద్ధి కోసం ఎంతో మంది కష్టపడి పనిచేసిన సర్పంచులు తమ పదవీ నుంచి దిగిపోయే ముందు ఆయా గ్రామాల ప్రజలు పౌర సన్మానాలు చేయాలని పిలుపునిచ్చారు. ఐదేళ్ల పాటు చిత్తశుద్ధితో పనిచేసిన సర్పంచుల సేవలను ప్రజలు కూడా గుర్తించేకోవాలని కోరారు.