ఫిబ్రవరి 7 నుండి 14 వరకు పారిశుద్ధ్యం పై ప్రత్యేక డ్రైవ్: జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి

0
16 Views

వికారాబాద్: గ్రామాల్లో ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు సక్రమంగా కల్పించే దిశగా ప్రత్యేక అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం గ్రామాల్లో చేపట్టే వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామపంచాయతీల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓ, ఎంపిఓ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు మేలు జరిగే విధంగా అధికారులు మనసు పెట్టి పని చేయాలన్నారు. అధికారులు నేరుగా ప్రజలకు సేవలు అందించే భాగ్యం దొరకడం బంగారు అవకాశమని కలెక్టర్ అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక అధికారులు గత ఐదు సంవత్సరాలుగా చేపట్టిన పనులతో పాటు, చేయాల్సిన పనులకు ఆదాయ వనరులపై కూడా దృష్టి సారించాలని తెలిపారు. ప్రాథమిక అవసరాలైన త్రాగునీరు సమస్య రాకుండా పైపుల లీకేజీలను సరి చేసుకుంటూ క్రమం తప్పకుండా త్రాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫ్లో కంట్రోల్ వాల్ ఉండేలా, మోటార్ల ద్వారా అక్రమంగా నీటిని పొందడం అరికట్టాలని అధికారులకు సూచించారు. నెలలో మూడుసార్లు నీటి ట్యాంకులను తప్పనిసరిగా శుభ్రపరిచే విధంగా చూడాలని తెలిపారు పల్లె ప్రగతి లో భాగంగా పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, కంపోజ్ షెడ్డుల నిర్వహణపై కూడా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ తెలిపారు. ఆదాయ వరులను సమకూర్చుకునేందుకు ఫిబ్రవరి 28 లోపు ఆస్తి పన్నులు వసూలు చేసే దిశగా కృషి చేయాలని ఆయన కోరారు.

ఫిబ్రవరి 7 నుండి 14 వరకు పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్

ఫిబ్రవరి 7 నుండి 14 వరకు పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, వారం రోజులపాటు ప్రత్యేక అధికారులు గ్రామాల్లో ఉండి ప్రజల సమస్యలపై అవగాహన కల్పించుకొని పనులు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టిని సారించి మురుగు కాలువల్లో నీటి నిల్వ ఉండకుండా పనులు చేపడుతూ ప్రజలు రోగాల బారిన పడకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. నీటి ట్యాంకుల వద్ద ఓవర్ ఫ్లో వాటర్ నిలువ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. తడి , పొడి చెత్తను వేరుగా సేకరించి రీసైక్లింగ్ చేసేలా చూడాలన్నారు.

59 కోట్లతో 766 సిసి రోడ్లను చేపట్టాలి

జిల్లాలో 59 కోట్లతో మంజూరైన 766 సీసీ రోడ్ల పనులను ఫిబ్రవరి 15 లోపు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికాబద్ధంగా రోడ్ల పనులను చేపట్టి ఫిబ్రవరి నెలలోపు పనులు పూర్తయ్యేలా ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ సూచించారు.

ఎన్ఆర్ఈజీఎస్ పనులు పెద్ద ఎత్తున చేపట్టాలి

జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామాలకు ఉపయోగపడే విధంగా పెద్ద ఎత్తున చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. పథకం ద్వారా 265 రకాల పనులు చేపట్టేందుకు అవకాశాలు ఉన్నందున గ్రామాలకు అవసరమయ్యే వాటిని మంజూరు చేసుకుని పనులు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. గ్రామాల్లో కూలీల సంఖ్యను పెంచే దిశగా పనిచేస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. గ్రామాలకు అనుసంధాన రోడ్ల వేసే దిశగా ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్, జెడ్పి సీఈవో జానకి రెడ్డి, డిపిఓ తరుణ్ కుమార్, డిఆర్డిఓ కృష్ణన్, పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమేష్, మిషన్ భగీరథ ఇఇ బాబు శ్రీనివాస్ లు పాల్గొన్నారు.