ఈ నెల 18 నుండి ప్రారంభం కాబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి:జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి

0
14 Views

వికారాబాద్: జిల్లాలో ఈ నెల 18 నుండి ప్రారంభం కాబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సి.నారాయరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 80 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 నిమిషాల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. 5 నిమిషాలు ఆలస్యంగా అనగా ఉదయం 9.35 నిమిషాల వరకు విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించబడతారని, విద్యార్థులందరూ వారి వారి హల్ టికెట్లు సరిచూసుకోవాల్సిందిగా కోరారు. అదేవిధంగా విద్యార్థులందరూ పరీక్ష కేంద్రాలను ఒకరోజు ముందుగానే సందర్శించి ప్రతిరోజు ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సిందిగా కలెక్టర్ సూచించారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసేందుకు అన్ని పరీక్ష కేంద్రాలలో తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని, విద్యార్థులందరూ కూడా వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిందిగా ఆయన తెలిపారు.విద్యార్థులు, పరీక్షలను నిర్వహించే అధికారులు, సిబ్బంది ఎలాంటి ఎలక్ట్రికల్ వస్తువులు , సెల్ ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లోను తీసుకు రాకూడదని తెలిపారు. పరీక్ష కేంద్రంలో , పరిసరాల్లో సెల్ ఫోన్ లు పూర్తిగా నిషేదించినట్లుగా ఆయన పేర్కొన్నారు.ఏమైనా సందేహాలు ఉంటే జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని 08416 – 235245 ఫోన్ ద్వారా సంప్రదించగలరని తెలిపారు. పరీక్షలకు బాలురు 6913, బాలికలు 6499 మొత్తం 13412 మంది విద్యార్థులు హాజరు కావడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.