రాష్ట్రంలో సీఎంది ఒక మాట మంత్రులది ఒక మాట : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

0
52 Views

వికారాబాద్ ( ధారూరు )  : ఎన్నికల్లో జిల్లాకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల తీసుకువస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని దాన్ని కొడంగల్ కాకుండా వికారాబాద్ తీసుకురావాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ధారూరు మండల కేంద్రంలో కీర్తి శేషులు కోస్నం లక్ష్మారెడ్డి జ్ఞాపకార్థం పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కోస్నం వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి విద్యార్థులను ఘనంగా సన్మనించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. పదవ తరగతి పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్ కు వచ్చిన విద్యార్థులు చేడు స్నేహాలకు దూరంగా ఉండి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే విధంగా కష్టపడి చదువుకోవాలన్నారు. పదవ తరగతి విద్యార్థులకే కాకుండా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇలాంటి సన్మాన కార్యక్రమాలు నిర్వహించాలని వేణుగోపాల్ రెడ్డికి సూచించారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ పాఠశాల తీసుకు వస్తానని చెప్పి ఆ ఊసే లేకుండా ఉందన్నారు. ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడితే మంత్రులు మరోక మాట మాట్లాడుతున్నారని మండి పడ్డారు. వికారాబాద్ జిల్లా వాసిని అని చెప్పుకునే ముఖ్యమంత్రి వికారాబాద్ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్, డాక్టర్ సబితా ఆనంద్, మాజీ జడ్పీటీసీ సుజాతవేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రకళ, కౌన్సిలర్లు అనంత్ రెడ్డి, గోపాల్, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.