ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డులు అందించాలి: సెర్ప్ సీఈవో , జిల్లా ప్రత్యేకాధికారి దివ్య దేవరాజన్

0
119 Views

వికారాబాద్: ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డులు అందించే దిశగా అధికారులు పనిచేయాలని సెర్ప్ సీఈఓ, జిల్లా ప్రత్యేక అధికారి దివ్య దేవరాజన్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొంపల్లిలో డిజిటల్ కుటుంబ ఇంటింటి సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి లతో కలిసి సెర్ప్ సీఈఓ, జిల్లా ప్రత్యేక అధికారి దివ్య దేవరాజన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ… ప్రభుత్వం ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు అందజేయనున్న నేపథ్యంలో మున్సిపల్ వార్డుల్లోకి, గ్రామాల్లోకి వచ్చే అధికారులకు తమ కుటుంబాల సమాచారాన్ని అందజేయాలన్నారు. సర్వే బృందాలు తమ గ్రామాలకు వచ్చినప్పుడు అందుబాటులో ఉండి తమ సమాచారాన్ని అందజేయాలని ఆమె ప్రజలకు సూచించారు. ప్రస్తుతం ఉమ్మడిగా ఉన్న కుటుంబాలు విడిగా ఉండాలనుకుంటే కుటుంబ యజమానిగా ఉండవలసిన వారితో వేరుగా డిజిటల్ కార్డు పొందేందుకు సమాచారాన్ని సర్వే బృందాలకు తెలియజేసి నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. సర్వే బృందాలు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కొందరు కుటుంబ సభ్యులు అందుబాటులో లేనట్లయితే డిజిటల్ కార్డు నిమిత్తం ఫోటోను తీసుకునేందుకు సమయం ఇచ్చి వివరాలు సేకరించాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో డి ఆర్ డి ఓ శ్రీనివాస్, ఇడియం మహమూద్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.