పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలి: జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి

0
11 Views

వికారాబాద్:  రాబోవు పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో పార్లమెంటు ఎన్నికల నిర్వహణ, ఓటర్ నమోదు, సవరణలుపై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలను రాజకీయ పార్టీల సహకారంతో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా పార్లమెంటు ఎన్నికలలో సహకరించాలని కోరారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ లో భాగంగా ఈనెల 20, 21 తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాలలో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటరు జాబితాలతో ఎల్ ఓ లు అందుబాటులో ఉంటారని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అలాగే స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించే విధంగా రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. జిల్లాలో ప్రకటించిన డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రచురితమైనందున ఇందులో ఏమైనా అభ్యంతరాలు, సవరణలు ఉంటే ఈనెల 22వ తేదీ వరకు తెలియపరచాలన్నారు. మార్పులు చేర్పులు, షిఫ్టింగులు, ఓటరు నమోదుకు ఫామ్ 6,7,8 ద్వారా దరఖాస్తు చేసుకోనే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని రాజకీయ ప్రతినిధులను కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, వికారాబాద్ తహసిల్దార్ లక్ష్మీనారాయణ, ఎలక్షన్ సెక్షన్ సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.