యువ ఓటర్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి: జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి

0
15 Views

వికారాబాద్:యువ ఓటర్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని  జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు.ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం సందర్భంగా 18 – 19 సంవత్సరాల వయస్సు గల యువ ఓటర్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని  సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి ఆయా అంశాలపై దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా వీ.సీ అనంతరం సంబంధిత జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 20 , 21 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు భాగస్వాములయ్యేలా చూడాలన్నారు. ముఖ్యంగా 18 ఏళ్ళు పూర్తి చేసుకున్న యువతీ, యువకులందరు తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా చొరవ చూపాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద నిర్ణీత 6 , 7 , 8 దరఖాస్తు ఫారాలతో అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఓటరు ముసాయిదా జాబితాలో ఏవైనా మార్పులు, చేర్పులు, సవరణలు, తొలగింపులు చేపట్టాల్సి ఉన్నట్లయితే, వాటిని సరిచేసుకునేలా చూడాలన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా గుర్తించిన అంశాలను పరిగణలోకి తీసుకొని డూప్లికేట్ ఓటర్లు, మృతి చెందిన ఓటర్లను, సిమిలర్ ఫోటో ఎంట్రీ, డెమోగ్రాఫికల్ సిమిలర్ ఎంట్రీ ఓటర్లను గుర్తించడం జరిగిందని, అలాంటి వారికి నోటీసులు పంపించి ఓటరు జాబితా నుండి అనర్హుల పేర్లు తొలగించే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. తుది జాబితాలో ఏ ఒక్క డూప్లికేట్ పేరు ఉండకుండా క్షుణ్ణంగా పరిశీలన జరపాలని సూచించారు. కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డుల కోసం వెంటనే ప్రింటింగ్ కోసం సమగ్ర వివరాలతో జాబితాను పంపించాలని ఎన్నికల విభాగం అధికారులను కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలో ఎక్కడైనా నివాస ప్రాంతానికి రెండు కిలోమీటర్లకు పైబడి దూరంలో పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లయితే, వాటి వివరాలు తెలియజేయాలని సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 25 న విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, వికారాబాద్, తాండూర్ ఆర్డీవోలు విజయ కుమారి, శ్రీనివాస రావు ఎలక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.