గురుకుల ఉద్యోగ ఫలితాలలో నాలుగు ఉద్యోగాలకు ఎంపికైన పులుసుమామిడి యువకుడు లక్ష్మిగళ్ల మహిపాల్

0
22 Views

వికారాబాద్:వికారాబాద్ జిల్లా, నవాబుపేట మండలం, పులుమామిడి గ్రామానికి చెందిన లక్ష్మిగళ్ల జంగయ్య,అనంతమ్మ ల మూడవ కుమారుడైన లక్ష్మిగళ్ల మహిపాల్ ఇటీవల ప్రకటించిన గురుకుల ఉద్యోగ ఫలితాలలో నాలుగు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.పేద కుటుంబంలో జన్మించిన ఇతను తన పాఠశాల విద్యాభ్యాసాన్ని స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి, ఉన్నత విద్య కోసం హైదరాబాద్ వెళ్లి అక్కడ నిజాం కళాశాలలో గ్రాడ్యుయేషన్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.పీజీలో ఉండగానే యు.జి.సి వారు నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (NET)లో జూనియర్ రీసెర్చ్ ఫెలో(JRF)గా ఎంపికై ప్రఖ్యాతిగాంచిన ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలుగు శాఖలో Ph.D అడ్మిషన్ పొంది ప్రస్తుతం “వడ్డేపల్లి కృష్ణ గేయాలు – సమగ్ర అధ్యయనం” అనే అంశం మీద పరిశోధన సాగిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒకవైపు అకాడమిక్ విద్యను కొనసాగిస్తూ మరోవైపు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ ఉండగా 2018 లోనే ‘పంచాయతీ కార్యదర్శి’ ఉద్యోగానికి ఎంపిక అయ్యారు. అధ్యాపక వృత్తిపై గల ఆసక్తితో ఆ ఉద్యోగాన్ని వదిలి తిరిగి ప్రిపరేషన్ ను కొనసాగిస్తూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వము నిర్వహించిన గురుకుల ఉద్యోగ పరీక్షలలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకుతో తమ ప్రతిభను కనబరిచారు. అందులో
1.డిగ్రీ లెక్చరర్
2.జూనియర్ లెక్చరర్ (2వ ర్యాంక్)
3.పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (2వ ర్యాంక్)
4.ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్
ఉద్యోగాలను సాధించి, కష్టపడి చదివితే ఏదైనా సాధ్యమని నిరూపించారు.ఈ ప్రయాణంలో తన వెన్నంటే ఉండి ప్రతీ సందర్భంలో మద్దతునిచ్చిన తన తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులకు, పాఠశాల మొదలుకొని విశ్వవిద్యాలయ స్థాయి వరకు మార్గదర్శనం చేస్తూ ముందుకు నడిపించిన గురువులకు,తన సహచర మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నాడు.
తను ఏ సమాజం నుండైతే జ్ఞానాన్ని పొందాడో తిరిగి తన వంతుగా సమాజానికి జ్ఞానాన్ని అందించే అవకాశం ఈ ఉద్యోగం ద్వారా లభించటం ఒక బాధ్యతగా భావిస్తూ ముందుకు సాగుతానని తెలియజేస్తున్నాడు.