అప్పుల బాధతో ఆదర్శ రైతు ఆత్మహత్య

0
266 Views

అనంతగిరి డెస్క్: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పాపటపల్లికి చెందిన ఇనపాల మాధవరావు (55) తన ఎకరన్నర భూమిలో జామ, కూరగాయలు, వేరుసెనగ వంటి పంటలను ప్రయోగాత్మకంగా సాగుచేస్తూ, అధిక దిగుబడులు సాధించి ఆదర్శ రైతుగా గుర్తింపు పొందారు. అతనికి పొలంలో డెయిరీ ఫాం ఏర్పాటుకు అవసరమైన వ్యయాన్ని తీర్చడానికి రూ. 3 లక్షలు అప్పు చేయగా ఈ అప్పుతో పాటు, గతంలో తీసుకున్న పంట రుణాలు, భూమి తాకట్టు పెట్టి తీసుకున్న ఇతర రుణాలు కలిపి మొత్తంగా రూ. 10 లక్షల వరకు అయింది. ఈ మధ్య కాలంలో మాధవరావు తల్లి   భార్య అనారోగ్యంతో బాధపడుతుండటం, అలాగే అప్పుల భారంతో ఆయన తీవ్ర మనోస్థాపానికి గురయ్యారు. చివరికి ఈ పరిస్థితులు భరించలేక, మాధవరావు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ సంఘటన పాపటపల్లిలో విషాదం నింపింది.