రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు తగు జాగ్రత్త చర్యలను చేపట్టాలి:జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

0
53 Views

వికారాబాద్:రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు తగు జాగ్రత్త చర్యలను చేపట్టాలని సంబంధిత అధికారులను వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు.శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జాతీయ రహదారులపై అధిక సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయని వీటిని నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు, రవాణా, జాతీయ రహదారులు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ప్రమాద స్తలాలను గుర్తించి ప్రమాదాలు జరగకుండా స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులను ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రమాదాల నివారణకు పోలీసు, రెవెన్యూ, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్, పంచాయతీ కార్యదర్శి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఆర్ అండ్ బి, జాతీయ రహదారుల ఇంజనీర్లను భాగస్వామ్యం చేస్తూ కమిటీ వేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కమిటీల ఆధ్వర్యంలో ప్రమాద స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదికలను సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన బాధిత కుటుంబాలకు మార్గదర్శకాలకు అనుగుణంగా నష్టపరిహారం చెల్లించాలని కలెక్టర్ సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే క్రమంలో ఘటనా స్థలంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించడం, అత్యవసరమైన సేవలు అందించిన వారిని గుర్తించి వారికి తగు ప్రోత్సాహకాలు అందించాలన్నారు.
పరిగి, కొడంగల్, పోలీస్ , రవాణా, జాతీయ రహదారుల అధికారులు సంయుక్తంగా ప్రమాదకర స్తలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రమాదాలకు గల కారణాలను స్పష్టంగా తెలుసుకొని ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జాతీయ రహదారికి గ్రామాల నుండి కలిపే అనుసంధాన రోడ్లకు ఇరువైపులా ఉన్న పొదలను తొలగించాలని అదేవిధంగా అవసరమైన స్థలాల్లో స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కె.నారాయణ రెడ్డి మాట్లాడుతూ… ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ ధరించని, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ సమావేశంలో తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, జిల్లా రవాణా అధికారి వెంకట్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఇ.ఇ ఉమేష్ , ఆర్ అండ్ బి ఇన్చార్జి ఇ.ఇ. శ్రీధర్ రెడ్డి లతోపాటు తాండూర్, వికారాబాద్, కొడంగల్, పరిగి డిఎస్పీలు, ఎక్సైజ్ శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.