నా గుండె చప్పుడు కొడంగల్… కొడంగల్ ను దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం..: సీఎం రేవంత్ రెడ్డి

0
63 Views

వికారాబాద్ (కొడంగల్ ): నా గుండె చప్పుడు కొడంగల్ అని కొడంగల్ ను దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని  సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ లో పర్యటించిన  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ  సందర్బంగా సీఎం మాట్లాడుతూ. కొడంగల్ నియోజకవర్గం నుంచి అరవై ఏళ్ల క్రితం అచ్యుతా రెడ్డి గెలిచి మంత్రి అయ్యారని  ఆ తరువాత ఈ నియోజవర్గం నుంచి మంత్రిగా ఎవరికీ అవకాశం రాలేదన్నారు. ఇప్పుడు కొడంగల్ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రిగా సోనియమ్మ నాకు అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. వందరోజుల్లో కొడంగల్ నియోజకవర్గానికి మెడికల్, ఇంజనీరింగ్, వెటర్నరీ, నర్సింగ్ జూనియర్, డిగ్రీ కాలేజీలు తెచ్చుకున్నామని  వందల కోట్లతో తండాలకు రోడ్లు తెచ్చుకున్నామని తెలిపారు. రూ.4వేల కోట్లతో నారాయణ్ పేట్- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చుకున్నామని, కొడంగల్ లో కాంగ్రెస్ ను ఓడించి రేవంత్ రెడ్డిని కిందపడేయాలని కొందరు కుట్ర చేస్తున్నారన్నారు. ఎందుకు రేవంత్ రెడ్డిని కిందపడేయాలి..? కరువు ప్రాంతమైన కొడంగల్ కు నారాయణ్ పేట్- కొడంగల్ ఎత్తి పోతల తెచ్చినందుకా? కాలేజీలు తెచ్చినందుకా? సిమెంటు ఫ్యాక్టరీలు తెచ్చి ఉపాధి కల్పిస్తున్నందుకా? అని ప్రశ్నించారు. జాతీయ ఉపాధ్యక్ష పదవి తెచ్చుకున్న అరుణమ్మ.. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా తేలేకపోయారన్నారు. కొడంగల్ ను అభివృద్ధి చేయనీయొద్దని అరుణమ్మ కుట్ర చేస్తోందని  కాంగ్రెస్ ను ఓడించేందుకు బీజేపీ, బీఆరెస్ కుట్రలు చేస్తున్నాయన్నారు.ఃఎందుకు కాంగ్రెస్ ను ఓడించాలి..?ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకా?రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చినందుకా? 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నందుకా? ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నందుకా? పదేండ్లల్లో బీఆరెస్ ప్రభుత్వం కొడంగల్ లో ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్రూం ఇచ్చిందా? అని ప్రశ్నించారు.  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసామని దేనికోసం రేవంత్ రెడ్డిని పడగొట్టాలి? ఎందుకు కాంగ్రెస్ ను ఓడించాలని మరో సారి ప్రశ్నించారు. ఓట్ల కోసం మతాల మధ్య గొడవలు పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారని పదేండ్లు ప్రధానిగా ఉన్న మోదీ ఈ ప్రాంతానికి ఏం చేశారన్నారు. పదేండ్లు ప్రధానిగా ఉన్న మోదీ మళ్లీ ఓటేస్తే చంద్రమండలానికి రాజవుతారాని రేవంత్ రెడ్డిని దెబ్బతీయడానికి వెనక గూడుపుఠాని చేస్తున్నారన్నారు. మనల్ని దెబ్బ తీయడానికి పన్నాగాలు పన్నుతున్నారని  ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు… కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడమన్నారు. నాతో కొట్లాడే హక్కు మీకుందని.. పట్టు పట్టి పని చేయించుకునే అధికారం మీకుందన్నారు. రాష్ట్రానికే నాయకత్వం వహించే అవకాశం మనకు సోనియమ్మ ఇచ్చారని పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ నుంచి 50వేల మెజారిటీ అందించాలన్నారు. కొడంగల్ పై జరిగే కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.