కలెక్టరేట్ లో ప్రజాపాలన సేవా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

0
42 Views

వికారాబాద్: కలెక్టరేట్ లో ప్రజాపాలన సేవా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల సౌకర్యార్ధం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటికే మున్సిపల్ పట్టణాలతో పాటు, అన్ని మండల కేంద్రాలలోని ఎంపీడీఓ కార్యాలయాలలో ప్రజా పాలన సేవా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. వివిధ పనుల నిమిత్తం, సమస్యలు విన్నవిస్తూ అర్జీలు సమర్పించేందుకు అనునిత్యం ఐ.డీ.ఓ.సీ (కలెక్టరేట్)కు వచ్చే వారికి సైతం ప్రజాపాలన సేవా కేంద్రం అందుబాటులో ఉండాలని భావించి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలలోని వంట గ్యాస్ సిలిండర్ రాయితీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తదితర పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పలు కారణాల వల్ల ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పొందలేకపోతున్న అర్హులైన దరఖాస్తుదారులు, ప్రజాపాలన సేవా కేంద్రాలను సందర్శించి ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిచేయించుకోవచ్చని సూచించారు. కలెక్టరేట్లోని సేవా కేంద్రం ప్రభుత్వ కార్యాలయాల పని దినాలలో ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. కలెక్టరేట్లో అందుబాటులోకి తెచ్చిన ప్రజాపాలన సేవా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డేటా సవరణ కోసం వచ్చే దరఖాస్తుదారులు తమ వెంట రేషన్ కార్డ్, ఆధార్ కార్డు, విద్యుత్ సర్వీస్ కనెక్షన్ నెంబర్, గ్యాస్ కనెక్షన్ నెంబర్, ఎల్.పీ.జీ కస్టమర్ ఐడి, మొబైల్ నెంబర్ తీసుకురావాలని సూచించారు.