ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ కింద జిల్లాలోని అన్ని గ్రామాలలో కేటాయించిన సిసి రోడ్ల పనులను త్వరగా ప్రారంభించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి 

0
19 Views

వికారాబాద్:మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలోని అన్ని గ్రామాలలో కేటాయించిన సిసి రోడ్ల పనులను త్వరగా ప్రారంభించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి  అన్నారు.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ సీసీ రోడ్ల నిర్మాణం, మహాలక్ష్మి పథకం కింద ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల పరిశీలన, ఆన్ లైన్ నమోదు తదితర అంశాలపై శనివారం జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సంబంధిత అధికారులతో టెలికాన్ఫెరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో కేటాయించబడిన సీసీ రోడ్ల పనులను వెంటనే ప్రారంభించి ఫిబ్రవరి, 15 వరకు పూర్తిచేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.జడ్పీ సీఈఓ, డి ఆర్ డి ఓ, డిపిఓ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని అన్నారు.ప్రజా పాలనలో భాగంగా మహాలక్ష్మి పథకం క్రింద రూ.500 లకే వంట గ్యాస్ సిలిండర్ ప్రభుత్వం అందించనున్న నేపథ్యంలో ప్రజాపాలన దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన పారదర్శకంగా నిర్వహించాలన్నారు. తప్పుగా ఉన్న గ్యాస్ ఏజెన్సీ పేరు, కన్స్యూమర్ నెంబరు, రేషన్ కార్డ్ నంబర్ లాంటి వివరాలను ఆన్ లైన్ లో ఎలాంటి తప్పులు దొర్లకుండ ఈరోజు సాయంత్రం వరకు పొందుపరచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు, రాహుల్ శర్మ, లింగ్యా నాయక్, వికారాబాద్, తాండూర్ ఆర్డీవోలు విజయకుమారి, శ్రీనివాసరావు, జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, తహసీల్దారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.