చదువు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి: జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి

0
53 Views

 

విరాకారాబాద్: చదువు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి విద్యార్థులకు హితవు పలికారు.షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పదవ తరగతి వసతి గృహ విద్యార్థిని, విద్యార్థులకు బుధవారం వికారాబాద్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో ప్రేరణ మరియు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులకు వివిధ పాఠ్యాంశాలపై తర్ఫీదు , మనోధైర్యాన్ని, వ్యక్తిగత నైపుణ్యాన్ని పెంచేందుకు నిష్ణాతులైన ఉపాధ్యాయులు, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్లచే తరగతులను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్న క్రమంలో భయం, ఉత్సాహం ఉంటుందని తమ లక్ష్యాన్ని సాధించే దిశగా చదువుపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఏవైనప్పటికీ చదువుకోవాలి అనే కోరిక గట్టిగా ఉంటే ఏదైనా సాధ్యమేనని కలెక్టర్ అన్నారు. విద్యార్థుల్లో లక్ష్యం గొప్పదిగా ఉండాలని, చదువుల్లో డిగ్రీలు ముఖ్యం కాదని నైపుణ్యంతో కూడిన విద్య అని కలెక్టర్ తెలిపారు. చదువు విద్యార్థులు దొడ్డిదారిలో పరీక్షలు రాసి ఉత్తీర్ణులైతే భవిష్యత్తులో ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుందని కలెక్టర్ తెలిపారు. వసతి గృహాల్లో చదువుకున్న విద్యార్థులందరూ పేదరికం నుండి వచ్చిన వారు కాబట్టి చదువుతో మీ భవిష్యత్తును మార్చుకొని మీ వంశ వృక్షంలో ఒక మలుపు దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుండి విద్యను అభ్యసించేందుకు వచ్చే విద్యార్థులకు ప్రభుత్వ ఎన్నో సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, పరీక్షల సమయంలో ప్రత్యేక తరగతులు నిర్వహించి స్టడీ మెటీరియల్ ను అందించడం జరుగుతుందని తెలిపారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్లు సలహాలు సూచనలను తీసుకొని పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించి ఉత్తీర్ణులు కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ అమిత్ నారాయణ, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి మల్లేశం, ఎస్సీ, బీసీ, సంక్షేమ అధికారులు ఉమాపతి, వీరానందం, భీమ్ రాజ్ లతో పాటు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్లు కె.రామచంద్రుడు, కె .మాధవి, మహేందర్, శ్రీధర్, పీ.వీ రెడ్డి, వివిధ వసతి గృహాల వార్డెన్లు, సిబ్బంది పాల్గొన్నారు.