వికారాబాద్ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తాం:రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

0
31 Views

వికారాబాద్:వచ్చే ఐదు సంవత్సరాలలో మూడువేల కోట్ల రూపాయల నిధులతో వికారాబాద్ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తానని రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్  అన్నారు.మంగళవారం స్థానిక అంబేద్కర్ భవనములో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా జిల్లా అన్ని రంగాలలో వెనుకబడిపోయిందని, రాబోవు రోజులలో నియోజకవర్గ ప్రజలందరికీ అన్నలా ఉండి జిల్లాను అభివృద్ధి పరుస్తానని తెలిపారు. ప్రాణహిత చేవెళ్ల, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు గత పాలకులు అన్యాయం చేశారని, ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లా ప్రజలకు సాగు, త్రాగునీరు అందించే దిశగా ముందుకు వెళ్తామన్నారు. జిల్లాలోని పంచాయతీరాజ్, రోడ్లు మరియు భవనాల రహదారులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయని రోడ్ల నిర్మాణం కోసం రూ. 300 కోట్ల నిధులను మంజూరు చేయించి అభివృద్ధి పరుస్తామని తెలిపారు. గత పది సంవత్సరాలుగా ప్రజలకు రేషన్ కార్డులు అందలేదని, దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ముందుగా రేషన్ కార్డులు అందజేస్తామని తెలియజేశారు. రేషన్ కార్డుల తర్వాత ఎన్నికలకు ముందు చెప్పినట్లు 6 గ్యారంటీలను అమలుపరుస్తామని అన్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసి రాష్ట్ర ప్రజలపై భారం మోపిందని, వీటన్నింటినీ అధిగమించి ప్రతి ఇంటికి ఆరు గ్యారంటీలను అందజేస్తామని, రెండు లక్షల రూపాయల రుణమాఫీని కూడా అమలుపరస్తామని అన్నారు. ఆరు గ్యారంటీల అమలులో అధికారులు అవినీతికి పాల్పడితే తీవ్ర చర్యలలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా అర్హులైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు లక్ష నూట పదహారు రూపాయల చెక్కులను అందజేశారు. ఎన్నికలకు ముందు మంజూరైన నిధుల చెక్కులు ల్యాబ్స్ కాకుండా, లబ్ధిదారులకు లాభం చేకూరాలనే ఉద్దేశంతో చెక్కులను అందించడం జరుగుతుందని, రాబోవు రోజులలో ఇట్టి డబ్బులతో పాటు ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం అందించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, వైస్ చైర్ పర్సన్ శంషాద్ బేగం, ఎంపీపీ చంద్రకళ,ప్లోర్ లీడర్ సుదాకర్ రెడ్డి,రత్నారెడ్డి ,రాజశేఖర్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు రెడ్యానాయక్ ,మురళి,ఎర్రవల్లి జాపర్, వార్డు మెంబర్లు, వికారాబాద్ నియోజకవర్గ ఎంపీపీలు, సర్పంచులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.