ప్రజాపాలన లో బాగంగా దరఖాస్తులను పైసా ఖర్చులేకుండా స్వీకరించడం జరుగుతుంది:స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

0
21 Views

వికారాబాద్:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా నాయకులు అధికారులు ప్రజల వద్దకే వచ్చి దరఖాస్తులను పైసా ఖర్చు లేకుండా స్వీకరించడం జరుగుతుందని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.మంగళవారం వికారాబాద్ మున్సిపల్ పరిధి 20వ వార్డు రాజీవ్ గృహకల్ప కాలనీలో నిర్వహించిన ప్రజా పాలన వార్డు సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను అందించడం జరుగుతుందన్నారు. ఒక్కటే దరఖాస్తుతో అన్ని గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రేషన్ కార్డుల కోసం తెల్ల కాగితంపై దరఖాస్తులు రాసి ఇవ్వాలని అన్నారు. ముందుగా అర్హులైన అందరికీ తెల్ల రేషన్ కార్డులు అందించిన పిదప మిగతా పథకాలను అమలు పరచడం జరుగుతుందని అన్నారు. తనకు ప్రజలు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహించి అన్ని విధాలుగా రాజీవ్ గృహ కల్ప కాలనీలో ఉన్న సమస్యలను తీరుస్తానని తెలిపారు. అన్ని పథకాలను ఇంటింటికి అందించే పూర్తి బాధ్యత తనదేనని, వచ్చే ఐదు సంవత్సరాలలో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి గ్యారంటీ పథకాలతో పాటు వికారాబాద్ నియోజకవర్గంలో అవసరం మేరకు అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. వికారాబాద్ జిల్లాను మూడు వేల కోట్లతో అభివృద్ధి ప్రస్తానని, ముందుగా పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి రహదారులతో పాటు ప్రాణహిత చేవెళ్ల, పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేస్తానని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు అనంతగిరి గుట్టను ఈకో టూరిజం క్రింద 200 కోట్ల నిధులతో అభివృద్ధి పరస్థానన్నారు. ఇప్పటికే కోటిపల్లి ప్రాజెక్టు వద్ద బోటింగ్ సదుపాయం కల్పించి యువతకు ఉపాధి కల్పించడం జరిగిందని, దీనితో పాటు వికారాబాద్ లో టెక్స్ టైల్స్ పార్క్ తీసుకువచ్చి 4,000 మంది మహిళలకు, అలాగే పరిశ్రమలను స్థాపించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని తెలియజేశారు.

జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి 6 గ్యారంటీలు అందే విధంగా ఒకే ఒక దరఖాస్తును సులువుగా రూపొందించడం జరిగిందన్నారు. దరఖాస్తులో తప్పులు దొరలకుండా నింపాలని సూచించారు. జిల్లాలోని 566 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీలలో గల 97 వార్డులలో గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు. ఏదైనా కారణం వల్ల గ్రామసభలో దరఖాస్తు చేసుకోకుంటే ఈనెల ఆరవ తేదీ వరకు సంబంధిత మున్సిపల్ లేదా గ్రామపంచాయతీ అధికారులకు దరఖాస్తులను అందజేయొచ్చని తెలిపారు. ఇప్పటికే లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేదని సూచించారు. ప్రతి దరఖాస్తుదారుడు తప్పు లేకుండా దరఖాస్తులు చూపిన సమాచారం అందించాలన్నారు. ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయకులకు సహాయం అందించడమేనని, చివరి వరుసలో ఉన్న పేదవారికి సంక్షేమ పథకాలు అందించినప్పుడే ఈ జిల్లా, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్ పర్సన్ లతో కలిసి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, వైస్ చైర్ పర్సన్ శంషాద్ బేగం,మున్సిపల్ ప్లోర్ లీడర్ సుదాకర్ రెడ్డి, వార్డ్ కౌన్సిలర్ మురళి లతో పాటు స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు