డీహైడ్రేషన్ ను నివారించడానికి తగు జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి:జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి

0
19 Views

వికారాబాద్:డీహైడ్రేషన్ (నిర్జలీకరణ) ను నివారించడానికి తగు జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి వైద్య అధికారులకు సూచించారు.రామయ్య గూడ (అనంతగిరి పల్లి) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ గావించారు . అవుట్ పేషంట్ , సిబ్బంది హాజరు పట్టిక రిజిస్టర్ లు, ఔషధ నిలువ గదిని కలెక్టర్ తనిఖీ చేశారు. అదేవిధంగా ఆసుపత్రిలో ప్రసవాలకు సంబంధించి ఇడిడి (ఎక్స్ పెక్టెడ్ డేటా ఆఫ్ డెలివరీ) బోర్డులో నమోదు చేసిన గర్భిణీల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వైద్య అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ… వేసవి కాలంను దృష్టిలో పెట్టుకొని ఆసుపత్రిలో కనీస అవసరాలు తీర్చే దిశగా మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఎప్పటికీ నిల్వ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఆశ వర్కర్ , క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది దగ్గర కూడా వందకు తగ్గకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని వైద్య అధికారులకు సూచించారు. వేసవిలో తగిన మోతాదులో నీరు తీసుకోకపోవడం వల్ల డిహైడ్రేషన్ గురవుతారనే విషయాన్ని ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. మనము త్రాగే నీరు కంటే ఎక్కువ నీటిని మన శరీరం నుండి కోల్పోయినప్పుడు డిహైడ్రేషన్ గురవుతాం అనే విషయాన్ని తెలియజేయాలని, డీహైడ్రేషన్ యొక్క సాధారణ సంకేతాలు, లక్షణాలకు సంబంధించి అదేవిధంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై కూడా ప్రజలకు వివరించాలని కలెక్టర్ తెలిపారు. డిహైడ్రేషన్ గురైన వ్యక్తులకు సత్వర వైద్య సేవలు అందించేందుకు కావలసిన మందులను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ వైద్యాధికారులకు సూచించారు. కలెక్టర్ తో పాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పల్వన్ కుమార్, వైద్యాధికారి డాక్టర్ సృజన, ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.