రేవంత్ రెడ్డి పాలనలో రైతుల నిరసనలు: హరీష్ రావు

0
115 Views

నర్సాపూర్: రాష్ట్రంలో రుణమాఫీ, రైతుబంధు వంటి పథకాల అమలులో విఫలమవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయని బీఆర్‌ఎస్‌ నేత హరీష్ రావు ఆరోపించారు. నర్సాపూర్‌లో పర్యటించిన హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రవ్యాప్తంగా రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నా, 50 శాతం రైతులకు మాత్రమే రుణమాఫీ లభించింది. 41 లక్షల మంది రైతులలో 21 లక్షల మందికి ఇప్పటికీ రుణమాఫీ కాలేదు,” అని అన్నారు.రైతుల ఆగ్రహం: “గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రుణమాఫీ చేపట్టలేదని రైతులు నాయకులను గదుల్లో బంధిస్తున్నారు. రేవంత్ రెడ్డి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఈ పరిస్థితి,” అని హరీష్ రావు మండిపడ్డారు.రైతుబంధు పథకం కూడా నిలిచిపోయిందని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. “రైతుబంధు నిధులు విడుదల చేయకపోవడం వల్ల రైతులు కష్టాల్లో ఉన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెద్ద వడ్లకు బోనస్ అంటూ చెప్పి, ఇప్పుడు సన్న వడ్లకు బోనస్ అని వాదనను మార్చింది. కానీ ఆ బోనస్ కూడా రైతులకు అందడం లేదు,” అని ఆయన విమర్శించారు.హరీష్ రావు ప్రభుత్వంపై దాడిని కొనసాగిస్తూ, “కాంగ్రెస్ 10 నెలల పాలనలో గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేయలేకపోయింది. సర్పంచులు ఆర్థిక ఇబ్బందులతో కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వంలో ప్రతి నెలా పల్లె ప్రగతి నిధులు అందగా, ఇప్పుడు నిధులు పూర్తిగా నిలిచిపోయాయి,” అని తెలిపారు.”రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టణాలు, గ్రామాలు రెండింటినీ గాలికి వదిలేసింది. హైడ్రా పేరిట డ్రామాలు చేస్తున్న ఈ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది,” అని హరీష్ రావు ధ్వజమెత్తారు.కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కింద ఇచ్చిన 800 కోట్ల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్లించింది,” అని ఆరోపిస్తూ, రైతుల సంక్షేమానికి పెద్ద కష్టం వాటిల్లిందని హరీష్ రావు వెల్లడించారు.రైతులకు 100% రుణమాఫీ జరగకపోతే, పంట బీమా, భరోసా పథకాలు అమలు కాకపోతే, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ బలమైన ఆందోళనలకు దిగుతుందని హరీష్ రావు హెచ్చరించారు.రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్ బ్రాండు ఇమేజ్ పూర్తిగా దెబ్బతింది. రియల్ ఎస్టేట్ రంగం కూడా తీవ్రంగా పడిపోయింది, అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.