100 కోట్లతో అనంతగిరి అభివృద్ది , 15 రోజుల్లో టెండర్లు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

0
16 Views

వికారాబాద్ జిల్లా: గిరిజనుల అభివృద్ధి కోసం 24 వేల కోట్ల రూపాయలతో ప్రధానమంత్రి జన్ మన్ కార్యక్రమం రూపొందించడం జరిగిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం పెద్దముల్ మండలము చైతన్యనగర్ లో నిర్వహించిన ప్రధానమంత్రి జన్మన్ మహా అభియాన్ కార్యక్రమంలో మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, గిరిజనుల జీవితాలలో నిజమైన సంక్రాంతి ఈ సంక్రాంతి అని అన్నారు. గత 75 సంవత్సరాలుగా కనీస సదుపాయాలు లేని గిరిజన గ్రామాలలో మౌలిక వసతుల కల్పన కొరకు ప్రధానమంత్రి గత నెల 15వ తేదీన క్యాబినెట్లో ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. దేశంలోని 15 రాష్ట్రాలలో గల 22 వేల గ్రామాలను గుర్తించి 39 లక్షల గిరిజన కుటుంబాలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు. ఈరోజు నుండి పక్కా ఇళ్ల నిర్మాణం కోసం లక్ష మంది లబ్ధిదారులకు వారి బ్యాంకు ఖాతాలలోకి నేరుగా అవసరమైన డబ్బులు జమ చేయడం జరుగుతుందని, 1000 కిలోమీటర్ల విస్తీర్ణంలో రోడ్ల నిర్మాణం, 27 వేల ఇండ్లకు నల్ల కనెక్షన్లు, 503 గ్రామాలకు మొబైల్ టవర్స్, 300, గ్రామాలకు విద్యుత్ కనెక్షన్లు, 10 వేల మందికి కిసాన్ క్రెడిట్ కార్డులు, 5 లక్షల విలువ గల ఉచిత వైద్య సదుపాయం కొరకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులను గిరిజన ఆదివాసీలకు అందించడం జరుగుతుందన్నారు. వీటితో పాటు అవసరమైన ఆధార్ కార్డులు, కుల ధ్రువీకరణ పత్రాలు అందించడం జరుగుతుందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో 468 గ్రామాలను గుర్తించి అందులో 55,000 మంది గిరిజన చెంచులకు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుందని తెలియజేశారు. గిరిజనుల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రత్యేక జాబ్ మేళాలు నిర్వహించి వారి అర్హతల మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులు అందరూ మానవతా దృక్పథంతో పనిచేసే మారుమూల ప్రాంతాలలో గల గిరిజనులకు వంద శాతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలుపరుస్తున్న ఫలాలను అందించాలన్నారు.

*100 కోట్ల రూపాయలతో అనంతగిరి గుట్టను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి*

వికారాబాద్ జిల్లా హైదరాబాదుకు చాలా సమీపంలో ఉన్నప్పటికీని అభివృద్ధికి నోసుకోలేదని, వికారాబాద్ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేసే అభివృద్ధి పరచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరు పనిచేసే స్వదేశీ దర్శన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఎందుకు అవసరమైన 100 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు తెలియజేశారు. 15 రోజులలో అనంతగిరి గుట్ట అభివృద్ధికి టెండర్ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు ఆధార్ కార్డులు, కుల ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందేశాన్ని అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి టీవీ పై తిలకించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, తాండూరు పరిగి శాసన సభ్యులు బి. మనోహర్ రెడ్డి,
టి. రామ్మోహన్ రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, పెద్దముల్ మండలం ఎంపీపీ అనురాధ, జడ్పిటిసి ధారాసింగ్, గ్రామ సర్పంచ్ లలిత తో పాటు జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, ఆర్డీవో శ్రీనివాసరావు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజి, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు ఇందిరా, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక అధికారులు, జిల్లాకు సంబంధించిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.