పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

0
20 Views

వికారాబాద్:పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి చీఫ్ సూపరింటెండెంట్ కు సూచించారు. పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో శనివారం వికారాబాద్ పట్టణ కేంద్రంలోని బ్రిలియంట్ పాఠశాలలో కొనసాగుతున్న పరీక్షా కేంద్రాన్ని  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ పదవ తరగతి పరీక్షలు ఎలాంటి పొరపాట్లకు తావునీయకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పరీక్ష కేంద్రంలోని ఆయా గదులలో తిరుగుతూ, పరీక్ష నిర్వహణ తీరును నిశితంగా కలెక్టర్ గమనించారు, పరీక్ష గదులను పరిశీలించి, పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు కేంద్రంలో కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతంపై  కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేసిన మీదట పరీక్ష కేంద్రంలోనికి అనుమతించాలని తెలిపారు. పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, తు.చ తప్పకుండా నిబంధనలు అమలయ్యేలా పర్యవేక్షణ జరపాలని  సూచించారు. పాఠశాల ఆవరణలో అంగవైకల్యం కలిగిన విద్యార్థి పరీక్షను సహాయకుడి ( స్క్రైబర్) తో రాయిస్తున్న విధానాన్ని కలెక్టర్ పరిశీలించి సహాయకుడి విద్యార్హత గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.