ప్రతి పౌరుడు తన హక్కులను ఉపయోగించుకుంటూ , బాధ్యతలను విస్మరించకుండా దేశాభివృద్ధికి పాటుపడాలి: జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి

0
11 Views

వికారాబాద్:ప్రతి పౌరుడు తన హక్కులను ఉపయోగించుకుంటూ , బాధ్యతలను విస్మరించకుండా దేశాభివృద్ధికి పాటుపడాలని జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు.75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా వికారాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పోలీస్ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. ఎందరో త్యాగదనుల పోరాట ఫలితంగా భారతదేశం స్వతంత్ర దేశంగా ఏర్పడిందని అన్నారు. భారత ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన కమిటీ విపులంగా చర్చించి , సవరణలు చేసి ఆమోదించబడిన భారత రాజ్యాంగాన్ని అమలుపరచుకోవడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం అవతరించడం జరిగిందన్నారు. భారత ప్రజలు సంపూర్ణ స్వేచ్ఛను, సమానత్వాన్ని, లౌకికత్వాన్ని, న్యాయాన్ని హక్కుగా పొందుటకు రాజ్యాంగం ద్వారా కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు.ప్రజా పాలన, పారదర్శకతతో సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ , సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని కలెక్టర్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యక్రమం లో భాగంగా ఆరు గ్యారెంటీలలో మహాలక్ష్మి , రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను డిసెంబర్ 9 నుండి అమలు పరచడం అయ్యిందన్నారు. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు 25 లక్షల పై చీలుకు ఉచిత బస్సు టికెట్లతో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ ప్రయాణ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారని తెలిపారు. పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద ప్రభుత్వం వైద్య సహాయ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచిందని కలెక్టర్ తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా జిల్లాలోని 566 గ్రామపంచాయతీలు, 4 మున్సిపాలిటీలలో 57 బృందాల ద్వారా 2,84,275 దరఖాస్తులను స్వీకరించి 1209 మంది సిబ్బందితో ఆన్లైన్ లో నమోదు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ తో పాటు రైతు భరోసా పథకం లో భాగంగా 2023-24 రబీ సీజన్ కు 2,95,796 మంది రైతులకు 322.76 కోట్ల రూపాలను కేటాయించడం జరిగిందని, ఇప్పటివరకు 1,68,085 మంది రైతులకు 95.48 కోట్ల రూపాయలను రైతులకు ఖాతాలోకి జమ చేయడం జరిగిందని తెలుపుతూ ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. రైతులకు 2 లక్షల రుణమాఫీకి బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయని, ఒక ప్రణాళిక ప్రకారం ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని కలెక్టర్ చెప్పారు.ఆర్థిక పునరావాసం పథకం కింద 26 మంది దివ్యాంగులకు 17 లక్షల 50 వేల ఆర్థిక సహాయం కలెక్టర్ చేతుల మీదుగా అందించడం జరిగింది. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా 539 స్వయం సహాయక సంఘాలకు 28 కోట్ల 75 లక్షల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును కలెక్టర్ అందజేశారు. అదేవిధంగా స్త్రీ నిధి ద్వారా 331 స్వయం సహాయక సంఘాలకు 6 కోట్ల 20 లక్షల రూపాయల చెక్కును ఆయన అందజేశారు.

గణతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా పూడూరు ఆదర్శ పాఠశాల, వికారాబాద్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సంఘం లక్ష్మీబాయి, కొత్తగడి రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సూపర్ లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థి విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా జ్ఞాపికలను అందజేశారు.

ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ అధికారులకు , ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేశారు.

అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలలను జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి, అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ , లింగ్యా నాయక్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్ లతో కలిసి కలెక్టర్ సందర్శించారు.