ఎన్నికల నిర్వహణకు ఓటరు జాబితా గుండెకాయ లాంటిది:రోల్ అబ్జర్వర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ ఐఏఎస్

0
28 Views

వికారాబాద్:ఎన్నికల నిర్వహణకు ఓటరు జాబితా గుండెకాయ లాంటిదని, బి ఎల్ ఓ లు, బి ఎల్ ఏ ల సహకారంతో తప్పులు లేని పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించాలని రోల్ అబ్జర్వర్ జ్యోతి బుద్ధ ప్రకాష్, ఐఏఎస్ అధికారులకు సూచించారు.గురువారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ సి. నారాయణ రెడ్డితో కలసి ఓటరు జాబితా రూపకల్పన పై అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద రాజకీయ నాయకుల సహకారంతో బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకొని వారి సహకారంతో బియల్ఓ ల ద్వారా పక్కా ఓటరు జాబితాను రూపొందించాలన్నారు. ఓటరు జాబితాలో డూప్లికేట్ ఓటర్లు, చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబ సభ్యులను సంప్రదించి పేర్లను తొలగించాలని సూచించారు. పక్కా ఓటర్ జాబితా రూపకల్పనకు గాను బి ఎల్ ఓ లు, బి ఎల్ ఏ లు తరచుగా సమావేశాలు నిర్వహించుకొని ఓటరు జాబితాను సిద్ధం చేయాలని అన్నారు. ప్రతి బి ఎల్ ఓ తన వద్ద ఫామ్ – 6,7,8 అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. బి ఎల్ ఓ వద్ద ఉన్న ఓటర్ జాబితాలో ప్రతి పేజీపై డూప్లికేట్ ఓటర్లు, చనిపోయిన వారు లేనట్లు ప్రతి పేజీపై సంతకం చేయాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువత అందరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు అవ్వాలని, అలాగే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకొనే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా రూల్ అబ్జర్వర్ సమావేశంలో పాల్గొన్న అధికారులు, వివిధ పార్టీల ప్రతినిధులు, బిఎల్ఓలతో ఓటర్ జాబితా రూపకల్పనపై ఓటర్ నమోదు, తొలగింపులు, మార్పులు చేరుకులు, సందేహాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఓటర్ నమోదుతో పాటు ఇతర ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నమోదు తో పాటు తొలగింపులు మార్పులు చేర్పులు సక్రమంగా చేపట్టడం జరుగుతుందని వారు ఆయనకు తెలియజేశారు. జిల్లాలో ఓటరు ప్రక్రియ చాలా బాగుందని అబ్జర్వర్ ప్రశంసించారు.

జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ సి. నారాయణరెడ్డి మాట్లాడుతూ, తుది ఓటరు జాబితాను ఫిబ్రవరి, 8న ప్రకటించనున్న సందర్భంగా అవసరమైన మార్పులు చేర్పులు సవరణలు తొలగింపులు అన్నింటిని ఈ మాసంతం వరకు సరి చేసి పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందిస్తామని అన్నారు. జిల్లాలో స్వీప్ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా వంద శాంతం నమోదు చేయించడం జరుగుతుందన్నారు. గత శాసనసభ ఎన్నికలలో జిల్లాలోని అన్ని కళాశాలల్లో స్వీప్ కార్యక్రమాలు నిర్వహించి దాదాపు అందరూ యువతీ యువకులకు ఓటరుగా నమోదు చేయడం జరిగిందని అన్నారు. సమ్మర్ స్పెషల్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులు అన్నింటిని మాసాంతం వరకు పరిష్కరించి, రాబోవు పార్లమెంట్ ఎన్నికలకు స్పష్టమైన ఓటర్ జాబితా రూపొందించినున్నట్లు కలెక్టర్ తెలియజేశారు.ఈ సమావేశంలో వికారాబాద్, కొడంగల్, పరిగి,తాండూర్ రిటర్నింగ్ అధికారులు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్, విజయ కుమారి, శ్రీనివాసరావు లతో పాటు నియోజకవర్గాల ఏ ఈ ఆర్ ఓ లు, వివిధ పార్టీల ప్రతినిధులు, బి ఎల్ ఓ లు పాల్గొన్నారు.