రుణమాఫీ పై రైతులు ఎలాంటి అపోహలకు తావు ఇవ్వొద్దు: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

0
286 Views

వికారాబాద్ : పంట రుణమాఫీ పై రైతులు ఎలాంటి అపోహలకు తావు ఇవ్వొద్దని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం రైతు నేస్తం పథకం ద్వారా రెండవ విడత రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాన్ని రైతులు, పిఎసిఎస్ చైర్మన్లు, వ్యవసాయ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఆన్ లైన్ ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ… రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, రైతులకు ఎలాంటి సందేహం ఉండకూడదు అన్నారు. ప్రభుత్వం నిర్ణయం మేరకు అర్హులైన లబ్ధిదారులకు రుణమాఫీ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేయడంలో భాగంగా మొదటి విడతలో వికారాబాద్ జిల్లాలో 46633 మంది లబ్ధిదారులకు 256.26 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగిందని అన్నారు. రెండవ విడత రుణ మాఫీలో భాగంగా జిల్లాలో 26438 మంది లబ్ధిదారులకు 262.64 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రుణ మాఫీ అయిన రైతులు కొత్తగా రుణాలు పొందే అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి పంటలు పండించుకుంటూ వృద్ధిలోకి రావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. రైతుల దయవల్లే ప్రజలకు ఎన్నో అవసరాలు తీరుతున్నాయని కలెక్టర్ తెలిపారు. రుణమాఫీ విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే వ్యవసాయ అధికారులు, బ్యాంకర్లు రైతుల సమస్యలను తెలుసుకొని నివృత్తి చేసేందుకు తోడ్పడాలని కలెక్టర్ సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతులకు రుణమాఫీ చెక్కులను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

*వికారాబాద్ జిల్లాకు రైతు రుణమాఫీ కింద 262.64 కోట్ల నిధులు విడుదల*

వికారాబాద్ జిల్లాలో రైతు నేస్తంలో భాగంగా రెండవ విడత పంట రుణ మాఫీ కింద లక్షా 50 వేల లోపు ఉన్న రుణాలకు గాను 262.64 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. రెండవ విడతలో జిల్లా వ్యాప్తంగా 26438 రైతు కుటుంబాలు లబ్ధి పొందాయి. జిల్లాలోని వికారాబాద్ నియోజక వర్గంలో 7442 మంది లబ్ధిదారులకు 74.95 కోట్లు, తాండూర్ నియోజక వర్గంలో 5376 మంది రైతులకు 52.93 కోట్లు, పరిగి నియోజక వర్గంలో 6166 మంది రైతులకు 62.06 కోట్లు, కొడంగల్ నియోజక వర్గంలోని కొడంగల్ , బొమ్మరస్ పేట్ , దౌల్ల్తాబాద్ మండలాలకు సంబంధించి 6057 మంది రైతులకు 61 కోట్ల రుణ మాఫీతో పాటు చేవెళ్ల నియోజకవర్గం లోని నవాబ్ పేట మండలంలోని 1397 మంది లబ్ధిదారులకు 11.7 కోట్ల రుణ మాఫీ చేయడం జరిగింది.

రుణ మాఫీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, లీడ్ బ్యాంక్ మేనేజర్ యాదగిరి, జిల్లా సహకార అధికారి ఈశ్వరయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, పిఎసిఎస్ ఛైర్మెన్ లు సత్యనారాయణ, లక్ష్మా రెడ్డి, మొగులయ్య, సంతోష్ రెడ్డి, జయకృష్ణ, వ్యవసాయ శాఖ అధికారులతో పాటు రైతులు పాల్గొన్నారు.