కాంగ్రెస్​ బస్​ ఫ్రీ ఇస్తే… బీజేపీ వస్తే బాధలు ఫ్రీ: కాంగ్రెస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి

0

శేరిలింగంపల్లి: తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం మ‌హిళ‌ల‌కు బ‌స్సు సౌక‌ర్యం ఫ్రీగా క‌ల్పిస్తే, మోడీ సర్కారు బాధ‌లు ఫ్రీగా క‌ల్పిస్తుందని వాపోయారు. కాంగ్రెసు ప్రభుత్వంతో సంక్షేమం గ్యారెంటీ అని చెప్పగా, బీజేపీ వస్తే సంక్షోభం గ్యారెంటీ అని చెప్పారు. బుధవారం కాంగ్రెస్​ పార్టీ శేరిలింగంపల్లిలో నిర్వహించిన రోడ్​ షోలో కాంగ్రెస్​ అభ్యర్థి డాక్టర్​ గడ్డం రంజిత్​ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. సీఎం రేవంత్‌కు అన్యాయంగా ఢిల్లీ పోలీసుల‌తో నోటీసులను ఇప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్నందుకే రేవంత్​రెడ్డిపై కేసులు పెట్టారని మండిపడ్డారు. ఒక్క‌సారి జైలుకు పంపినందుకే రేవంత్… ఈ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి అయ్యారని… మ‌రి ఇప్పుడు ఢిల్లీ పోలీసులు తీసుకెళితే, ఇంకెంత స్థాయికి వెళ‌తారో చూడాలన్నారు. తమకు గ‌తంలో అండ‌గా ఉన్నానని, ఇప్పుడు గెలిపిస్తే రెట్టించిన ఉత్సాహంతో మీకు మ‌రిన్ని సేవ‌లందిస్తానని తెలిపారు. గ‌తంలో ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి ఈ ప్రాంతానికి ఏం ఒర‌గ‌బెట్టారని ప్రశ్నించారు. క‌రోనా స‌మ‌యంలో ఆయ‌న ఇంటి నుంచి బ‌య‌ట‌కే రాలేదని విమర్శించారు. శానిటైజ‌ర్ పూసుకుని ఇంట్లో ప‌డుకున్నారని చెప్పారు. ఆయ‌న ఏ ఒక్క‌రికీ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌రని తెలిపారు. తాను మీకు త‌ల‌లో నాలుక‌లా ఉంటానని… క‌ష్ట న‌ష్టాల్లో పాలుపంచుకుంటానన్నారు. అందుకే ఈ చేవెళ్ళ ప్రజలు విజ్ఞ‌త‌తో ఆలోచించి ఓటేయాలని కోరారు.

చేవెళ్లకి టైం ఇస్తున్న రేవంతన్నకు థ్యాంక్స్​

తమ చేవెళ్ళ కోసం ఇన్ని గంటలు టైం ఇస్తున్న రేవంత్ అన్నకు థ్యాంక్స్​ చెప్పారు. తమ కోసం ఇన్నిగంట‌ల‌పాటు ఓపిగ్గా ఎదురు చూసిన అక్క‌ల‌కు, అన్న‌ల‌కు అంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇదే ఓపిక‌తో ఈనెల 13న క‌చ్చితంగా హ‌స్తం గుర్తుకే ఓటేసి, తనను గెలిపించాలన్నారు.