తల్లీ శిశువు ప్రాణాలు కాపాడడం వైద్య సిబ్బంది బాధ్యత:డీఎంహెచ్ఓ పల్వన్ కుమార్

0
15 Views

వికారాబాద్: తల్లీ శిశువుల ప్రాణాలు కాపాడటం జిల్లాలో పని చేస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బంది బాధ్యత అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పల్వన్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో మాతృ మరణాలు,శిశు మరణాలపై ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల  వైద్యాధికారులు, సూపర్ వైజర్లు, ఆశలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గర్భధారణ నుండి ప్రసవం వరకు ఎలాంటి ప్రమాదకర లక్షణాలు కనిపించిన వెంటనే సంబంధిత వైద్యాధికారి రిఫర్ చేయాలని, అవసరమైతే పై స్థాయి ఆసుపత్రులకు తీసుకు వెళ్లాలని సూచించారు. వైద్యుల సూచన ప్రకారం చికిత్స అందించి తల్లీ, బిడ్డల ప్రాణాలు కాపాడడం మన బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. ఒక సంవత్సరం లోపు పిల్లల మరణాలు చోటు చేసుకోకుండా వైద్యులు, సంబంధిత సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలందరికి వ్యాధి నిరోధక టీకాలు తప్పక వేయాలని
ఆదేశించారు. ఎండా కాలంలో ప్రజలు వడ దెబ్బకు గురి కాకుండా అవగాహన కల్పించాలని, తలపై టోపీ లేదా గొడుగు వంటి వాటిని వాడి ఎండ నుండి రక్షణ పొందాలని, తరుచుగా నీరు తాగాలని, మధ్యాహ్నం ఎండలో తిరగరాదని, ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్దులు వడ దెబ్బకు గురి కాకుండా జాగ్రత్త పడేలా అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. పీహెచ్సీ ల వైద్యాధికారులు ఎన్క్యూఏఎస్ నిబంధనల ప్రకారం ఉండాలని మెడికల్ అధికారులను ఆయన ఆదేశించారు.