నర్సరీలు ప్రభుత్వ స్థలంలోకి మార్చాలి: కలెక్టర్ నిఖిల

0
20 Views

వికారాబాద్:  జిల్లాలో ప్రైవేటు స్థలాలలో నిర్వహిస్తున్న నర్సరీలు అన్నంటిని ప్రభుత్వ స్థలాలలోకి వారం రోజులలో మార్చాలని జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో హరితహారం నర్సరీలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య పనులు తదితర అంశాలపై మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేటు స్థలాలలో నిర్వహిస్తున్న నర్సరీలను అన్నింటిని వారం రోజులలో ప్రభుత్వ స్థలాలలో వంద శాంతం షిఫ్ట్ చేయాలని ఆదేశించారు. ఈసారి హరితహారంలో భాగంగా లక్ష్యం మేరకు మొక్కలు పెంచేందుకు గాను నాణ్యమైన మట్టితో బ్యాక్ ఫీలింగ్ చేపట్టాలని సూచించారు. స్థానికంగా దొరికే నాణ్యమైన విత్తనాలను విత్తి వంద శాంతం మొక్కలు మొలకెత్తేలా చూడాలని అన్నారు. ఇట్టి పనులను వారం రోజులలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపీడీవోలు, ఎంపీఓలు, మండల స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించాలని కోరారు. నర్సరీలలో ఉన్న మొక్కలకు ప్రతివారం ట్యాంకుల ద్వారా నీరు తెప్పించి పట్టాలన్నారు. ప్రతి నర్సరీలో మొక్కల వివరాలు తెలిపే రిజిస్టర్ లను కచ్చితంగా నిర్వహించాలని ఆదేశించారు. వన సేవకుల ద్వారా నర్సరీల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించి లక్ష్యం మేరకు నాణ్యమైన మొక్కలను అందించాలని అన్నారు.  ఇప్పటి వరకు జిల్లాలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలకు సంబంధించిన స్థల సేకరణ పనులను తాసిల్దారుల సహకారంతో చేపట్టి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. క్రీడా ప్రాంగణాలలో మొలచిన గడ్డి, పిచ్చి మొక్కలను తొలగించి అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. అన్ని గ్రామ పంచాయతీలలో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు నిర్వహించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ క్రింద చేపట్టిన పనులన్నింటికీ వివరాలు తెలిపే బోర్డులను ఏర్పాటు చేయాలని, పంచాయతీ కార్యాలయాలలో నిర్వహించాల్సిన 32 రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించి, జాబ్ కార్డు వివరాలు అప్డేట్ గా ఉండేలా ఎంపీడీవోలు పర్యవేక్షిస్తూ ఉండాలని అన్నారు. జిల్లాలో మొదటి విడతాగా మంజూరైన మన ఊరు మన బడి పనులను వేగవంతం చేసి పాఠశాలలను అందంగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. పనులకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని, పనులు పూర్తయిన వెంటనే ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లింపు కొరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, డి ఆర్ డి ఓ కృష్ణన్ లతో పాటు మండలాల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.