పేద కుటుంబానికి పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

0
52 Views

వికారాబాద్: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ప్రజా పాలన, అంగన్వాడి, గ్రామపంచాయతీలో చేపడుతున్న భవనాల పురోగతి, ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులు, పారిశుధ్యం తదితర అంశాలపై ఎంపీడీవోలతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజా పాలనలో భాగంగా వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు పొందేలా చూడాలన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా గ్యాస్ సబ్సిడీ, గృహ జ్యోతి ద్వారా విద్యుత్తు సున్నా బిల్లు కు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, లబ్ధి పొందుతున్న సంఖ్య ఎంత అనే వాటిపై దృష్టి సారించి వాటిని లబ్ధిదారులకు పొందలేని పక్షంలో సాకేత సాంకేతిక లోపాలను సరిచేసి వారం రోజుల్లో అర్హులైన వారికి పథకాలు వర్తించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. ఏవేని సమస్యలు ఉంటే పరిష్కరించేందుకుగాను సిబ్బందికి మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఆగస్టు 20 లోపు అంగన్వాడి లలో చేపడుతున్న మరమ్మత్తులు, పెయింటింగ్ పనులను పూర్తి అయ్యేలా ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అంగన్వాడి కేంద్రాల్లో నాణ్యమైన ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా వెంటిలేటర్లకు మెస్ (జాలి)లను అమర్చాలని కలెక్టర్ సూచించారు. గ్రామపంచాయతీలలో అసంపూర్తిగా ఉన్న వివిధ భవన నిర్మాణ పనుల వివరాలను సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కింద చేపట్టి పూర్తి చేసిన పనుల వివరాలతో పాటు పనులు చేపట్టకు ముందు, పూర్తి అయిన తర్వాత తీసిన ఫోటోలను సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనుల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ భూములను యుద్ధ ప్రాతిపదికన చదును చేసే విధంగా పనులను చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 37 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వ పాఠశాలల ప్రహరీ గోడ నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలకు కలెక్టర్ సూచించారు. వేసవి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా చేపట్టిన పనులకు సంబంధించి చెల్లింపులపై ఆరా తీశారు. పనులు పూర్తి అయినప్పటికీ చెల్లింపులో జ్యాప్యం ఎందుకని సంబంధిత ఇంజనీర్లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పనులు పూర్తయిన వాటికి త్వరితగతిన చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ఇంఛార్జ్ అదనపు కలెక్టర్ సుధీర్, డిఆర్ డిఓ శ్రీనివాస్, డిపిఓ జయసుధ, సిపిఓ అశోక్ కుమార్, ఇంచార్జ్ డిడబ్ల్యూఓ వెంకటేశ్వరమ్మ, మిషన్ భగీరథ ఇఇ బాబు శ్రీనివాస్, డిఎల్పిఓ లు సంధ్యారాణి, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.