ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు:అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ

0

వికారాబాద్:ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తూ పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వికారాబాద్ నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.బుధవారం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో పార్లమెంటరీ ఎన్నికలను పురస్కరించుకొని వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనుసరించి ఎన్నికలు సాఫీగా, సజావుగా జరిగేలా సహకరించాలన్నారు.ప్రజలు అధిక సంఖ్యలో పోలింగ్ లో పాల్గొని స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కును వినియోగించుకునేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అవసరమని ఆయన అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక సౌకర్యాలతో పాటు వేసవిని దృష్టిలో పెట్టుకొని త్రాగునీరు, అత్యవసర మందులను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.ఈ సమావేశంలో కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి, ఎంఐఎం, సిపిఎం రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు వికారాబాద్ తహసిల్దార్ లక్ష్మీనారాయణ, డిప్యూటీ తహసిల్దార్ అనిత పాల్గొన్నారు