వికారాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలను అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తా: తెలంగాణా శాసన సభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్

0
17 Views

వికారాబాద్:వికారాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలను అన్ని రంగాల్లో అభివృద్ధి కృషి చేస్తానని తెలంగాణా శాసన సభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు.గురువారం మద్గుల్ చిట్టంపల్లి డిపిఆర్సి భవన్లో జిల్లా పరిషత్ సర్వసభ్య  సమావేశానికి  ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి, సభాపతి జిల్లా వాసులు కావడంతో ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారని, ప్రజల అవసరాలను తమ దృష్టికి తీసుకువస్తే అభివృద్ధి దశకు తీసుకు వెళ్తామన్నారు. ప్రజల అవసరాలు జిల్లా అభివృద్ధికి అధికారుల పాత్ర ఎంతో ముఖ్యమని, అధికారులు అలసట తో ఉండకుండా సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. గత ప్రభుత్వంలో స్థానిక సంస్థల్లో చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో చేపట్టిన పనులకు చెల్లింపులు చేయకపోవడంతో ఇబ్బంది పడుతున్న సర్పంచులు, కాంట్రాక్టర్లు కష్టాలను తీర్చేందుకు కృషి చేస్తానని సభాపతి హామీ ఇచ్చారు. ఎన్ని నిధులు ఖర్చయినప్పటికీ విద్య, వైద్య రంగాలకు ప్రాముఖ్యత కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం కింద ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను కచ్చితంగా అమలు పరుస్తామని అదేవిధంగా ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తామని ఆయన అన్నారు. జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పినట్లైతే జిల్లాలో 2 లక్షల మంది నిరుద్యోగలకు ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.చేవెళ్ల ప్రాణహిత, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి దాని ద్వారా సాగునీరు, త్రాగునీరు అందిస్తామని సభాపతి అన్నారు. 200 కోట్ల నిధులతో అనంతగిరి గుట్ట లో ఈకో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. గతంలో 225 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 25 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.జిల్లాలోని కోటపల్లి జుంటుపల్లి, సర్పన్ పల్లి లతో పాటు ఇతర ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రాజెక్టుల అభివృద్ధితో పర్యాటక రంగం ద్వారా నిరుద్యోగ యువతకు ఎంతో ఉపాధి కల్పించిన వారమవుతామని ఆయన అన్నారు. కోటిపల్లి ప్రాజెక్టులో బోటింగ్ ఏర్పాటు వల్ల హైదరాబాద్ నుండి పర్యాటకుల సందర్శన భారీగా పెరిగిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
జిల్లా పరిషత్ భవన సముదాయ నిర్మాణానికి కావలసిన నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి చే మాట్లాడి మంజూరు చేసేందుకు కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో బాగంగా జిల్లా పరిషత్ నిధులను వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు. జిల్లా అక్రమ ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణా జరక్కుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండేలా ప్రజల అవగాహన కల్పించాలని అన్నారు. అటవీ ప్రాంతంలో చెట్లను కాపాడడంతో పాటు వన్యప్రాణులకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆసుపత్రులకు సుదూర ప్రాంతాల నుండి ప్రజలు చికిత్స నిమిత్తం పెద్ద సంఖ్యలో వస్తున్నందున వైద్య విద్య మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. రోడ్ల నిర్మాణాలు నాణ్యత ప్రమాణాలు పాటించి చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. పదవ తరగతిలో మంచి ఫలితాలు వచ్చే దిశగా ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆమె సూచించారు.
సమావేశ అనంతరం సభాపతిని అధికారులు, ప్రజా ప్రతినిధులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.ఈ సర్వసభ్య సమావేశంలో పరిగి, తాండూర్ శాసనసభ్యులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, బుయ్యాని మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ జానకి రెడ్డి లతో పాటు జిల్లా అధికారులు, జడ్పిటిసిలు, ఎంపీపీలు పాల్గొన్నారు.