ఈనెల 14 నుండి 30 వరకు జంతు సంరక్షణ పక్షోత్సవాలు

0
12 Views

వికారాబాద్:దేశ వ్యాప్తంగా జంతు సంరక్షణ పక్షవత్సవాలు ఈనెల 14 నుండి 30 వరకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి డా।। పి. అనిల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జంతు హింసకు పాల్పడకుండా,  జంతువుల పట్ల కరుణతో ఉంటూ వాటిని సంరక్షించవలసిన అవసరం ప్రతి  పౌరునిపై ఉందని తెలియచేశారు.  వికారాబాద్ జిల్లా లో జంతు సంరక్షణ కొరకు సేవచేయు వారికి , స్వచ్ఛంద సంస్థలకు ప్రతి పౌరుడు సహకరించాలని తద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి  దోహదపడాలని,  వన్యప్రాణులు కనిపించినట్లయితే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చి వాటిని సురక్షిత అటవీ ప్రాంతానికి తరలించేందుకు సహకరించాలని కోరారు. పక్షులు నివసించే ఆవాసాలైన వృక్షాలను నరకరాదని అదేవిధంగా పశువులను , జంతువులను రవాణా చేసే క్రమంలో తప్పనిసరిగా జంతు రవాణా నిబంధనలను పాటించాలని అన్నారు. వీధులలో తిరిగే కుక్కలు,  పిల్లులు,  ఆవులు తదితర జంతువుల పట్ల కరుణతో వ్యవహరించి వాటికి ఆహారం,  త్రాగునీరు అందించాలని వాటిని హింసకు గురి  చేయకూడదని, పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా రోగ నిరోధక టీకాలు వేయించాలని సూచించారు. పెంపుడు జంతువులను అమ్ముట, కొనుట వాటి సంతాన అభివృద్ధి ( బ్రీడింగ్ )చేయడం ద్వారా వ్యాపారం చేయువారు తప్పని సరిగా జంతు సంరక్షణ బోర్డు నుండి  రిజిస్ట్రేషన్ పొందాలని అన్నారు. నిబంధనలు ఉల్లంగించినట్లయితే శిక్షార్హులు అవుతారాని తెలిపారు.  అలాగే ప్రజలు తినుబండారాలు కలిగిన  ప్లాస్టిక్ కవర్లను రోడ్డు ప్రక్కన , ఆరు బయట పడేయరాదని, జంతువులు అట్టి ప్లాస్టిక్ కవర్లు, సంచులు తినడం వలన చనిపోయే ప్రమాదం ఉందని తెలియచేశారు.ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ, వికారాబాద్ జిల్లా తరపున స్కూల్ పిల్లలకి జంతు సంరక్షణపై అవగాహణ కల్పించడం, పక్షుల కొరకు జామూన్, వేప, రావి ఇతర మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహణ కల్పించడం మరియు పశువైద్య క్యాంప్ లు నిర్వహించడం జరిగిందన్నారు.  ఈ నెల 23 నాడు ప్రతీ పశు వైద్యశాలలో పెంపుడు కుక్కలకు ఉచితముగా రేబీస్ వ్యాధి నిరోధక టీకాలు వేస్తారని తెలియజేశారు.