పచ్చకామెర్లతో అస్వస్థకు గురైన విద్యార్థినీలకు మెరుగైన వైద్యం అందించాలి:జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి

0
18 Views

వికారాబాద్:పచ్చకామెర్లతో అస్వస్థకు గురైన విద్యార్థినీలకు మెరుగైన వైద్యం అందించి త్వరితగతిన కోలుకునేందుకు సత్వర సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం కొత్తగడి లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో పచ్చకామెర్ల మూలంగా అస్వస్థకు గురైన విద్యార్థినీల ఆరోగ్య పరిస్థితులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినిల్లో మనోధైర్యాన్ని కలిపిస్తూ, ఆహారంలో మార్పులు చేస్తూ శక్తివంతమైన ఆహారాన్ని, పండ్లు అందిస్తూ, విద్యార్థినీలకు సరైన సంరక్షణలో వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. విద్యార్థినిల ఆరోగ్య మెరుగుకు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వైద్య అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని కలెక్టర్ తెలిపారు. పాఠశాల పరిసర ప్రాంతాలు  పరిశుభ్రంగా ఉండేలా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యాన్ని పాటించాలని కలెక్టర్ సూచించారు. వంట గదిలో పనిచేసే సిబ్బంది కూడా పరిశుభ్రంగా వుంటూ వంటకాలను సిద్ధం చేయాలని  తెలిపారు. త్రాగునీటికి సంబంధించి అదేవిధంగా పాఠశాల మరమ్మతులు, లీకేజీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ కు సూచించారు.కలెక్టర్ ఆకస్మిక పర్యటనలో భాగంగా నీటి సంపును, భోజన శాల, వంట గది, స్టోర్ ను పరిశీలించి ఆహారపు పదార్థాల నిలువల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.కలెక్టర్ తో పాటు డీఎస్సీడబ్ల్యూ మల్లేశం, డిసిహెచ్ఎస్ డాక్టర్ ప్రదీప్ కుమార్, డిప్యూటీ డిఎంహెచ్వో జీవరాజు, పాఠశాల ప్రిన్సిపాల్ అపర్ణ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.