రైస్ మిల్లర్లు రీసైక్లింగ్ కు పాల్పడితే వారిపై క్రిమినల్ చర్యలు:జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్

0
23 Views

వికారాబాద్:ఖరీఫ్ సీజన్ 2023-24 లో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 44 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి సేకరించడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు.మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో రైస్ మిల్లర్లతో సిఎంఆర్ ధాన్యాన్ని ఎఫ్ సి ఐ కు వెంటనే డెలివరీ చేసే అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన వరి ధాన్యాన్ని జిల్లాలోని 27 రైస్ మిల్లర్లకు సీఎంఆర్ కొరకు అందజేయడం జరిగిందని తెలిపారు. ఇట్టి ధాన్యాన్ని వెంటనే ఎఫ్ సి ఐ కు డెలివరీ చేయాలని రైస్ మిల్లర్లకు ఆదేశించారు. రైస్ మిల్లర్లు తమ మెల్లింగ్ సామర్థ్యం ప్రకారం ప్రతిరోజు సిఎంఆర్ రైస్ డెలివరీ చేయాలని సూచించారు. ఇట్టి ధాన్యాన్ని ఎవరైనా రైస్ మిల్లర్లు రీసైక్లింగ్ కు పాల్పడితే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అందరు మిల్లర్లు 2023-24 సంవత్సరమునకు సంబంధించిన కాస్టమ్ మిల్లింగ్ రైస్ ను వెంటనే డెలివరీ చేయాలని ఆయన ఆదేశించారు. పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దారులు ప్రతిరోజు మిల్లులలో ధాన్యాన్ని తనిఖీ చేసి వెంటనే ఎఫ్ సి ఐ కు విడుదల చేసే విధంగా చర్యలు చేపట్టి నివేదికలో అందించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా పూర్వసరఫరాల అధికారి రాజేశ్వర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ కొండలరావు, పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దారులు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.