18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి

0
20 Views

వికారాబాద్:18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు.14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గురువారం యేన్నేపల్లి చౌరస్తా నుండి కలెక్టరేట్ సముదాయం వరకు అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్, స్వీప్ నోడల్ అధికారి మల్లేశం నేతృత్వంలో కళాశాల, పాఠశాలల విద్యార్థిని విద్యార్థులచే భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది. కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తో కలిసి జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి అధికారులు, విద్యార్థిని విద్యార్థులచే ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశం మందిరంలో వయోవృద్ధ ఓటర్లు, యువ ఓటర్లను ఈ సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా శాలువా, జ్ఞాపికలతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఎన్నికల ప్రక్రియలో భాగంగా యువత పాత్ర ఎంతో ముఖ్యమైందని, ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో భాగస్వాములు కావాలన్నారు. ఎన్నికల్లో పాల్గొనాలంటే ముందుగా ఓటరుగా నమోదు అయ్యి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఓటరుగా నమోదు చేసుకోవడం చాలా సులభతరం అయ్యిందని ఆన్లైన్లో, మీసేవ ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఓటర్ గా నమోదు చేసుకునేందుకు వీలుగా సమ్మర్ రివిజన్ నిర్వహిస్తూ గ్రామాల్లోని ప్రతి బూత్ స్థాయిలో అధికారులను నియమించి ఓటరుగా నమోదు చేసుకునేందుకు వీలుగా దరఖాస్తుల స్వీకరించడం జరుగుతుందని ఆయన అన్నారు. కులం, మతం, వర్గాలకు అతీతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా బాధ్యతతో తమ ఓటును వినియోగించుకోక పోయినట్లు అయితే భవిష్యత్ తరాలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుందని దీని అధిగమించేందుకు ప్రతి ఒక్కరు చొరవ చూపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు సేవ చేసే, పరిపాలించే అర్హత మేరకు ఓటు వేయాలని ఆయన సూచించారు. సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాన్ని నిర్దేశించేది తమ ఓటు మాత్రమే అని ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు.

జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్. కోటిరెడ్డి మాట్లాడుతూ… అతి పెద్ద ప్రజాస్వామ్యం, లిఖితపూర్వ రాజ్యాంగం మన భారతదేశం అన్నారు. యువత ఓటరు నమోదు చేసుకోవడంతోపాటు ఇంటి చుట్టుపక్కల వారిని ప్రతి ఒక్కరు పదిమంది చొప్పున ప్రభావితం చేసే విధంగా ఉండాలని ఆయన తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా మంచి నాయకుని ఎంచుకునే విధంగా తమ ఓటు ఉండాలని ఆయన అన్నారు. వంద శాతం ఓటు హక్కును వినియోగించుకునేల కృషి చేయాలని ఆయన తెలిపారు. గత ఎన్నికల్లో అధికారులు సమన్వయంతో నిష్పక్షపాతంగా పనిచేయడం జరిగిందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే ఓరవడితో పనిచేయలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ , లింగ్యా నాయక్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్, స్వీప్ నోడల్ అధికారి ఎన్. మల్లేశం, జిల్లా అధికారులు, వివిధ కళాశాల, పాఠశాలల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.