పురుషాదిక్య భావజాలాన్ని వ్యతిరేకిద్దాం! స్త్రీ పురుష సమానత్వానికై పోరాడుదాం : POW రాష్ట్ర అధ్యక్షురాలు జి ఝాన్సీ

0
73 Views

వికారాబాద్: స్త్రీలను పితృస్వామిక ఆధిపత్యం అణచి వేస్తూనే ఉందని POW రాష్ట్ర అధ్యక్షురాలు జి ఝాన్సీ అన్నారు. శనివారం వికారాబాద్ క్లబ్ హాల్ లో జిల్లా అధ్యక్షురాలు వై గీతా, ఏ ప్రభావతి ఆధ్వర్యంలో జిల్లా 2వ మహాసభలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.   దురాచారాలకు, గృహ హింసకు గురి చేస్తూనే ఉందని సామాజిక, మత, ఆచార సాంప్రదాయాల కట్టుబాట్ల పేరుతో స్త్రీల ఆత్మగౌరవం దెబ్బతీయబడుతూనే ఉందన్నారు. దీనికి వ్యతిరేకంగా మహిళా ఉద్యమాలు నిరంతరం గొంతు ఎత్తుతున్నాయని అన్ని రంగాల్లో సమాన అవకాశాల కోసం, హక్కుల కోసం పోరాటం సాగిస్తూనే ఉన్నారన్నారు. పురుషులతో పాటు ప్రతి రంగంలో పోటీపడుతూ దేశాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.  అయినప్పటికీ ఇంటా, బయట హింస కొనసాగుతూనే ఉందన్నారు. పురుషాధిపత్యం రూపం మార్చుకుని కొనసాగుతుందని. ఎంతో ప్రతిభ సామర్థ్యాలు ఉన్నా రాజకీయ రంగంలో అవకాశాల్లేవన్నారు. నిర్ణయాధికారాల్లో భాగస్వామ్యం లేదని సమర్థవంతంగా పనిచేసినా ఉద్యోగ, ఉపాధి రంగాల్లో పదోన్నతులు, సమాన వేతనాలు పొందలేక అణిచివేతకు, వివక్షకు గురవుతున్నారన్నారు. పర్మినెంట్ ఉద్యోగాల కంటే కాంట్రాక్టు ఉద్యోగాలు ఇస్తూ సమాన వేతనాలు అమలు చేయడం లేదని సర్వీస్ రంగంలో గౌరవ వేతనాల పేరుతో దోపిడికి గురవుతున్నారన్నారు. అన్ని రంగాల్లో ప్రవేశం ఉన్నట్లు కనబడుతున్నా అంతటా ఏదో ఒక రకమైన వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారన్నారు.
బిజెపి పాలిత రాష్ట్రాల్లో బహు బేటికా ఇజ్జత్, గర్ వాపస్, మతమార్పిడి, లవ్ జిహాద్, హిజాబ్ నిషేధం లాంటి ఆదేశాలు ముందుకు తెస్తూ స్త్రీల ఎంపిక హక్కును కాలు రాస్తున్నారు. ఎన్నికల ముందు మహిళల ఓట్లను దండుకోవడం కోసం చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నామంటూ 33 శాతం రిజర్వేషన్ల చట్టం చేశారని తెలిపారు. ఏ చట్టాన్ని అయినా వెంటనే అమలుచేసే మోడీ ప్రభుత్వం వచ్చే ఐదారు సంవత్సరాలలో కూడా మహిళా రిజర్వేషన్ చట్టం అమలు చేసే పరిస్థితి లేదన్నారు.
స్త్రీలపై లైంగిక దాడులు,పసిపిల్లలపై  పాశవికమైన  అత్యాచార ఘటనలు తెలంగాణలో నిత్యం కొనసాగుతూనే ఉన్నాయని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా మహిళలపై మనువాద భావజాలం రుద్దే ప్రయత్నాలు తీవ్రంగా కొనసాగుతున్నాయని మహిళ మల్లయోధుల మీద లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదు చేయడానికి పోరాడాల్సి వచ్చిందన్నారు.. బిల్కిస్ బాను పై సామూహిక అత్యాచారం చేసి, 15 మంది హత్యలకు పాల్పడిన దుర్మార్గులకు క్షమాబిక్ష ప్రసాదిస్తూ విడుదల చేసి సన్మానాలు చేస్తున్నారు. కతువా, హత్రాస్ లాంటి సంఘటనలు జరిగిన సందర్భంలో నేరస్తులను రక్షించే వైపుగా ప్రభుత్వాలు సైతం ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంలో పోరాడి సాధించిన చట్టాలను వ్యాఖ్యానించడంలోనూ, తీర్పులు ఇవ్వడంలోనూ కోర్టులు చట్టాల స్ఫూర్తి కి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు.  సాధించుకున్న  చట్టాలను నిలబెట్టుకుంటూ వివిధ రూపాల్లో కొనసాగుతున్న పితృస్వామిక ఆధిపత్యానికి వ్యతిరేకంగానూ, మనువాద భావజాలంతో ముందుకు వస్తున్న అణిచివేతను ఎదుర్కోవడానికి సంఘటిత ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం  ఉన్నది అన్నారు. ఈ కార్యక్రమంలో అర్నీలా, పద్మమ్మ, లక్ష్మ, సమీనా, ఆశ్రిన్, ఉమా, ఆశ, అంజమ్మ ,లక్ష్మి, మరియు జిల్లాలో నుండి వివిధ ప్రాంతాల నుండి మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు