పిల్లల ఆరోగ్యం కోసం టీడీ వ్యాక్సినేషన్ … బహిరంగ ధూమపానం చేస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ నిఖిల

0
16 Views

వికారాబాద్:  పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకే టి.డి. వ్యాక్సినేషన్ వేయనున్నట్లు జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో టీ.డీ వ్యాక్సినేషన్ జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లలకు ధనుర్వాతం రాకుండా ఉండేందుకు టి.డి. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ఈనెల 7 నుండి 19 వరకు నిర్వహించే వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వ్యాక్సినేషన్ చేసేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారిగా సూక్ష్మ ప్రణాళికను సిద్ధం చేసుకొని వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టాలని అధికారులకు సూచించారు. 10 మరియు 16 సంవత్సరముల వయసు గల బాల, బాలికల వివరాలను గ్రామాల వారీగా సిద్ధం చేసుకుని బడిలో ఉన్న , బడి బయట ఉన్న పిల్లలకు వ్యాక్సినేషన్ వేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో నవంబర్ 7, 8 తేదీల్లో గ్రామాల్లో, మునిసిపాలిటీ వార్డులలో వ్యాక్సినేషన్ చేయాలని అదేవిధంగా నవంబర్ 9, 10, 11 వ తేదీలలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ప్రణాళిక బద్ధంగా పెద్ద మొత్తంలో వ్యాక్సినేషన్ చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. వ్యాక్సినేషన్ పై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో, వార్డుల్లో వ్యాక్సినేషన్ చేసిన వివరాలను ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు రోజు అందించేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. అత్యవసర సమయాల్లో సంప్రదించేందుగాను ఫోన్ నంబర్ లో వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.

*బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసిన వారిపై చర్యలు*
బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు.
బుధవారం కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పొగాకు నియంత్రణ సెల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నివారించేందుకు ప్రజలు ఎక్కువ సంఖ్యలో సంచరించే స్థలాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆమె తెలిపారు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, సినిమా థియేటర్లు, ఆసుపత్రులు, కళాశాలల పరిసరాల్లో పొగాకు తీసుకోవడం వల్లే జరిగే నష్టాలు, ప్రమాదాలపై అవగాహన కల్పించే సూచిక బోర్డులు, గోడ ప్రతులను ప్రదర్శించాలని కలెక్టర్ తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానా విధించడం జరుగుతుందని కలెక్టర్
హెచ్చరించారు.
ఈ సమావేశాల్లో జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పల్వాన్ కుమార్, విద్యాశాఖ అధికారి రేనుకాదేవి, జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి , అడిషనల్ ఎస్పీ రషీద్, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
సమావేశానంతరం కోప్టా సెక్షన్స్ సంబంధించిన వాల్ పోస్టర్ ను కలెక్టర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు.