పోడు భూముల లబ్దిదారుల వివరాలు అందజేయాలి: జిల్లా కలెక్టర్ నిఖిల

0
22 Views

వికారాబాద్ : పోడు భూముల లబ్ధిదారులకు హక్కు పత్రాలు జారీ చేసేందుకు సబ్ డివిజనల్ లెవెల్ కమిటీలు అర్హుల వివరాలను మూడు రోజులలో అందజేస్తే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సబ్ డివిజనల్ లెవెల్ కమిటీ సభ్యులతో ROFR-2005 చట్టం ప్రకారం అర్హులైన వారికి పోడు భూముల కేటాయింపు కోసం జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ నిఖిల అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా ఆర్డిఓ ల అధ్యక్షతన నిర్వహిస్తున్న సబ్ డివిజనల్ లెవెల్ కమిటీలు సిఫారసు చేసిన లిస్టును సమావేశంలో జడ్పిటిసి లకు అందజేయడం జరిగినది. ఇట్టి లిస్టు ప్రకారం అర్హులైన వారిని గుర్తించి వారి వివరాల జాబితాను మూడు రోజుల లోపు జిల్లాస్థాయి కమిటీకి అందజేస్తే, తిరిగి జిల్లా స్థాయి కమిటీని కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించి అర్హులను ఎంపిక చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఆర్ఓయఫ్ఆర్ – 2005 చట్టం ప్రకారము డిసెంబర్, 2005 అంటే ముందు పోడు భూములలో సేద్యం చేసుకుంటా ఉన్న వారు మాత్రమే హక్కు పత్రాలు పొందేందుకు అర్హులని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని జడ్పిటిసిలు జిల్లా కలెక్టర్ను కోరగా, కలెక్టర్ స్పందిస్తూ ఆర్ఓయఫ్ఆర్ చట్ట ప్రకారమే అర్హులను ఎంపిక చేసి పట్టాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. కమిటీల ద్వారా లబ్ధిదారులకు ఎవరికైనా అన్యాయం జరిగినట్లయితే అట్టివారు 60 రోజుల లోపల సబ్ డివిజన్ లెవెల్ కమిటీ, డిస్టిక్ లెవెల్ కమిటీలకు ఆపిల్ చేసుకోవచ్చని కలెక్టర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్.ఓ. యఫ్. ఆర్. చట్టంపై అవగాహన కల్పించడం జరిగినది. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లారెవెన్యూ అధికారి అశోక్ కుమార్, వికారాబాద్ ఆర్డిఓ విజయ కుమారి, జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజి, కమిటీ సభ్యులు ధరూర్, కుల్కచర్ల, పెద్దముల్, బషీరాబాద్, బోమ్రాస్పెట్ జెడ్పిటిసిలు, అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.