
మర్పల్లి ఘటనపై మంత్రి దామోదర్ రాజనర్సింహ విచారం
Advertisement
వికారాబాద్, జూన్ 6: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో హోటల్ భవనం పైకప్పు కూలి నలుగురు గాయపడిన ఘటనపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురిలో ఇద్దరిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మరో ఇద్దరు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. అలాగే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరి ఆరోగ్య పరిస్థితిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ)ను అడిగి తెలుసుకున్నారు. వారికి కూడా మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మంత్రి, బాధితులకు అవసరమైన వైద్య సహాయం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని అధికారులకు స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తోంది.
Share this article


