
మర్పల్లి హోటల్ స్లాబ్ కూలిన ఘటన.. బాధితులను పరామర్శించిన స్పీకర్
Advertisement
వికారాబాద్ జిల్లా, జూన్ 6: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎస్సీ కార్పొరేషన్ దుకాణ సముదాయంలోని ఖాన్ హోటల్ భవనం స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో నలుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి ఇద్దరిని సురక్షితంగా బయటకు తీశారు. చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ హుటాహుటిన ఘటనపై ఆరా తీసి పార్టీ శ్రేణులు, అధికారులను అప్రమత్తం చేశారు. బాధితులకు వెంటనే అవసరమైన సహాయం అందించాలని ఆదేశించారు. అనంతరం చికిత్స పొందుతున్న బాధితులను సంగారెడ్డి ఆసుపత్రిలో స్పీకర్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హామీ ఇచ్చారు. ఘటనపై స్థానిక అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
Share this article


