
నాగర్‌కర్నూల్ ఘటనపై బీఆర్ఎస్ యువనేత ఆర్. విజయ్ రాజ్ ఆగ్రహం
Advertisement
వికారాబాద్: నాగర్‌కర్నూల్ జిల్లా తాండూర్ మండలంలోని కుమ్మేర మల్లన్న జాతర సందర్భంగా చాకలి కుటుంబంపై జరిగిన దాడి సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందని భారత రాష్ట్ర సమితి యువ నాయకుడు ఆర్. విజయ్ రాజ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుల దురహంకారంతో ఈ దారుణ ఘటన చోటుచేసుకుందని ఆయన ఆరోపించారు. తల్లి పొత్తిలో ఉన్న పసికందును కాళ్లతో తన్ని, గొంతు నులిమి చంపడం అమానుషమని, ఇది క్రూరత్వానికి నిదర్శనమని ఖండించారు. ఈ ఘటనను కేవలం ఒక కుటుంబంపై జరిగిన దాడిగా కాకుండా, మహిళల గౌరవంపై, దళిత, బీసీ సమాజంపై మరియు మానవ హక్కులపై జరిగిన దాడిగా చూస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దైవ దర్శనం కోసం వచ్చిన ఆ కుటుంబం తమ వద్ద డబ్బులు లేవని, బయట నుంచే దర్శనం చేసుకుంటామని చెప్పినా వినకుండా ఆధిపత్య కుల అహంకారంతో దుశ్చర్యకు పాల్పడటం అత్యంత దారుణమని ఆర్. విజయ్ రాజ్ విమర్శించారు.
Share this article


