
కొల్కోంద గ్రామ గ్రామసభ బహిష్కరణ
Advertisement
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కోల్కొంద గ్రామపంచాయతీలో గ్రామసభ ఉద్రిక్త పరిస్థితుల మధ్య బహిష్కరణకు దారితీసింది. గ్రామ సర్పంచ్ కరణం కీర్తి రామకృష్ణ (MCA) ప్రభుత్వం, అధికారులు తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామసభను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. సర్పంచ్ ఆరోపణల ప్రకారం, గత రెండు విడతలుగా ఎన్ఆర్ఈజీఎస్ నిధులు గ్రామపంచాయతీకి కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. అంతేకాక, గత మూడు నెలలుగా గ్రామపంచాయతీ కార్యదర్శిని నియమించకపోవడం వల్ల పరిపాలనలో అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. అయినప్పటికీ, తాము ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేస్తూ గడపగడపకు తిరిగి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఇటీవల గ్రామానికి చెందిన రాఘవేందర్ రెడ్డికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు (నెంబర్: 143203) మార్చి 10న మంజూరైనప్పటికీ ఇప్పటివరకు అందలేదని ఆమె ఆరోపించారు. ఈ విషయమై మండల పరిషత్, ఎమ్మార్వో కార్యాలయాలకు సమాచారం ఇచ్చినా అధికారులు పరస్పరం బాధ్యతను మళ్లించుకుంటున్నారని విమర్శించారు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ, దీనిని క్రిమినల్ సమస్యగా పరిగణించలేమని చెప్పి నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. మహిళా సర్పంచ్‌గా తాను ఎదుర్కొంటున్న అవమానకర పరిస్థితులు తీవ్రంగా కలిచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామసభలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను చదవాలన్న మనసు లేదని, వాస్తవానికి గ్రామంలో పథకాలు అమలు కావడం లేదని విమర్శించారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు తక్షణం విడుదల చేయడం, గ్రామపంచాయతీ కార్యదర్శిని వెంటనే నియమించడం, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామసభను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
Share this article


