
లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు అందించాలి: కలెక్టర్ దీపక్ తివారి
Advertisement
వికారాబాద్ : జిల్లాలో ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 అమలులో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్‌లో జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక బ్యాంకర్ల (డీసీసీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా వివిధ యూనిట్ల స్థాపనపై కార్యాచరణను ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. లక్ష రూపాయల విలువ గల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను 90 శాతం సబ్సిడీతో అందించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్న జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లలో పనిచేస్తున్న వారికి ఎంపికలో ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. అలాగే, రూ.3 లక్షల విలువ గల గూడ్స్/ప్యాసింజర్ త్రిచక్ర వాహనాలను 70 శాతం సబ్సిడీతో మంజూరు చేస్తామని తెలిపారు. వీటి ద్వారా లబ్ధిదారులు స్థిరమైన ఆదాయం పొందే అవకాశముందని చెప్పారు. రూ.3 నుండి 7 లక్షల మధ్య విలువ గల సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ యూనిట్లను 60 శాతం సబ్సిడీతో అందిస్తామని పేర్కొన్నారు. ఈ పథకాలను ఎస్సీ నిరుద్యోగ యువత మరియు రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాకు ఈ పథకం కింద 168 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 82 త్రిచక్ర వాహన యూనిట్లు, 17 సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ యూనిట్లు కేటాయించబడినట్లు తెలిపారు. ఈ యూనిట్లను త్వరితగతిన అమలు చేయడంలో బ్యాంకర్లు చురుకుగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ నెల 24లోగా అర్హులైన ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించాలని, బ్యాంకులు వాటిని వేగంగా పరిశీలించి రుణాల మంజూరు ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఎస్సీ యువతకు ఉపాధి అవకాశాలు విస్తరించడంలో అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు కె. బాబు మొజెస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ వి. యాదగిరి, ఎస్బిఐ, యూనియన్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తదితర బ్యాంకుల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Share this article


