download
సెల్ ఫోన్ దొంగల ముఠా గుట్టురట్టు.. 25 ఖరీదైన ఫోన్లు స్వాధీనం
General

సెల్ ఫోన్ దొంగల ముఠా గుట్టురట్టు.. 25 ఖరీదైన ఫోన్లు స్వాధీనం

Friday, 27 March 2026181 views

Advertisement

వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఖరీదైన సెల్ ఫోన్లు దొంగిలిస్తున్న ముఠాను జిల్లా సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా సుమారు రూ.3.75 లక్షల విలువైన 25 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో పెరుగుతున్న సెల్ ఫోన్ దొంగతనాలను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS ఆదేశాల మేరకు సీసీఎస్ ఇన్స్పెక్టర్ బల్వంత్ రాయ్, వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ రఘు కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్, బొంరాస్‌పేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులను ఆధారంగా తీసుకుని సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ వివరాలను విశ్లేషించిన పోలీసులు నిందితుల కదలికలను గుర్తించారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా డోన్ మండలానికి చెందిన కె. రవి అలియాస్ గౌరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు మరో ఐదుగురు పెద్దలు, ముగ్గురు మైనర్ బాలురతో కలిసి రద్దీ మార్కెట్ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నాడు. ముఠా సభ్యులు ఆటోలు, బైక్‌లపై తిరుగుతూ, కూరగాయలు కొనుగోలు చేస్తున్న సమయంలో అప్రమత్తంగా లేని ప్రజల సెల్ ఫోన్లను మైనర్ల ద్వారా దొంగిలించేవారని వెల్లడైంది. అనంతరం ఆధారాలు లేకుండా ఉండేందుకు ఫోన్లను పరస్పరం మార్చుకునేవారు. పోలీసులు నిందితులు అద్దెకు తీసుకున్న నివాసంలో సోదాలు నిర్వహించి మొత్తం 25 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కె. రవి (అలియాస్ గౌరి), బి. మహేష్, ఆకుల కార్తీక్, వడ్డె మురళి, వడ్డె వెంకటేష్, సంపంగి తిరుపతి లను నిందితులుగా గుర్తించారు. ఈ సందర్భంగా సీసీఎస్ ఇన్స్పెక్టర్ బల్వంత్ రాయ్ మాట్లాడుతూ, రద్దీ ప్రదేశాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఖరీదైన మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా ఉంచుకోవాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. సెల్ ఫోన్ దొంగతనాలపై కఠిన చర్యలు తీసుకుంటాము” అని హెచ్చరించారు. ఈ ముఠా పట్టుబడటంలో కీలక పాత్ర పోషించిన సీసీఎస్ మరియు వికారాబాద్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఆయన అభినందించారు. అరెస్టైన నిందితులపై వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే పలు కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు.

అరెస్టయిన నిందితులు:

కె. రవి (అలియాస్ గౌరి) – కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ బి. మహేష్ – మహబూబ్‌నగర్ జిల్లా ఆకుల కార్తీక్ – శేరిలింగంపల్లి, హైదరాబాద్ వడ్డె మురళి – జడ్చర్ల, మహబూబ్‌నగర్ జిల్లా వడ్డె వెంకటేష్ – బాలానగర్, మహబూబ్‌నగర్ జిల్లా సంపంగి తిరుపతి – పాపిరెడ్డి కాలనీ, హైదరాబాద్

ఈ ఆపరేషన్‌లో వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ రఘు కుమార్, సీసీఎస్ ఎస్‌ఐ రమేష్, పోలీస్ సిబ్బంది రాజు, రామకృష్ణ, రవీందర్, రమేష్, మునిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Share this article

Related Articles