
తెలంగాణకు కాంస్యం తెచ్చిన దూద్యాల గోపాలకృష్ణయ్య
Advertisement
వికారాబాద్ , మార్చి 30: బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన 27వ ఆసియా టైక్వాండో ఛాంపియన్‌షిప్ మరియు 9వ ఆసియా టైక్వాండో పూమ్సే ఛాంపియన్‌షిప్ జాతీయ స్థాయి సెలక్షన్ ట్రయల్స్‌లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన దూద్యాల గోపాలకృష్ణయ్య కాంస్య పతకం సాధించారు. రికాగ్నైజ్డ్ పూమ్సే ఇండివిడ్యువల్ అండర్-50 ఏజ్ గ్రూప్‌లో జరిగిన ఈ పోటీల్లో సర్వీసెస్ జట్టు క్రీడాకారుడు తొలి స్థానం, ఎస్‌ఎస్‌బీ క్రీడాకారుడు ద్వితీయ స్థానం పొందగా, గోపాలకృష్ణయ్య తృతీయ స్థానంలో నిలిచారు. రామయ్యగూడకు చెందిన గోపాలకృష్ణయ్య ప్రస్తుతం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. గతంలో వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్‌లో కూడా పతకం సాధించిన ఆయన, ఈసారి కూడా ప్రతిభ చాటుతూ బలమైన సర్వీసెస్, ఎస్‌ఎస్‌బీ జట్లతో పోటీ పడి కాంస్యం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణయ్య మాట్లాడుతూ, దేశానికి ప్రాతినిధ్యం వహించే దిశగా ఈ విజయం తనకు ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు. తన విజయానికి సహకరించిన ఉన్నతాధికారులు, హ్యూమన్స్ ఫిట్ టైక్వాండో అకాడమీ సభ్యులు, టైక్వాండో అసోసియేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సాధించిన విజయంపై తోటి పోలీస్ అధికారులు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Share this article


