
ప్రజా సమస్యల పరిష్కారానికి ‘ప్రజా పాలన–పట్టణ ప్రణాళిక’
Advertisement
వికారాబాద్, ఏప్రిల్ 2 : వికారాబాద్ పట్టణంలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటికి త్వరితగతిన పరిష్కారాలు చూపేందుకు ప్రభుత్వం ‘ప్రజా పాలన–పట్టణ ప్రణాళిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని జిల్లా అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ తెలిపారు. గురువారం 17వ వార్డు మధు కాలనీలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. ప్రభుత్వం సహకారంతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని, ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారు మున్సిపాలిటీకి సమర్పించిన ప్లాన్ ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణాలను పర్యవేక్షించాలని, వార్డు అధికారులు నిరంతరం తమ పరిధిలో పర్యటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్మన్ గడ్డం అనన్య మాట్లాడుతూ వికారాబాద్ పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు మరింత బాధ్యతతో పని చేసి ప్రజా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని వివరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ మంగీ లాల్, మున్సిపల్ కమిషనర్ విక్రం సింహ రెడ్డి, కౌన్సిలర్లు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Share this article


