
పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ ప్రతీక్ జైన్
Advertisement
వికారాబాద్: జిల్లాలో నిర్వహించే పదవ తరగతి వార్షిక పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించారు. మంగళవారం ఐడీఓసీ సమావేశ హాలులో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, మార్చి 14, 2026 నుంచి ఏప్రిల్ 16 వరకు పదవ తరగతి పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో మొత్తం 69 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మొత్తం 13,579 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని వెల్లడించారు. విద్యార్థులు హాల్‌టికెట్లు ముందుగానే సరిచూసుకోవాలని, పరీక్షా కేంద్రాలను ఒకరోజు ముందే సందర్శించాలని, ప్రతిరోజూ గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఫర్నిచర్, త్రాగునీరు, విద్యుత్, టాయిలెట్లు, ఫ్యాన్లు వంటి సౌకర్యాలు సమకూర్చాలని తెలిపారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఈఓ రేణుకాదేవి, ఏసీజీఈ రామ్ రెడ్డి, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Share this article


