
కోట్‌పల్లి వాగుపై హై లెవల్ బ్రిడ్జి : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
Advertisement
వికారాబాద్ : వర్షాకాలంలో వరదలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారంగా కోట్‌పల్లి వాగుపై హై లెవల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నాం. పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని ధారూర్ మండలం కోట్‌పల్లి వాగుపై రూ. 27.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన హై లెవల్ బ్రిడ్జికి ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ప్రస్తుతం ఉన్న లో లెవల్ బ్రిడ్జిపై వరదల సమయంలో నీరు ప్రవహించడం వల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గతంలో వరదల కారణంగా బ్రిడ్జి కొట్టుకుపోయిన ఘటనలను గుర్తు చేశారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా చర్చించి నిధులు మంజూరు చేయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, అదనపు కలెక్టర్ రాజేశ్వరి, ఆర్&బి చీఫ్ ఇంజినీర్ వసంత నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కోట్‌పల్లి రిజర్వాయర్ ఆధునీకరణ కోసం రూ. 90 కోట్లు మంజూరు చేయించామని, పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అవి పూర్తయిన తర్వాత 9,200 ఎకరాల ఆయకట్టు పరిధిలో రైతులకు సమృద్ధిగా సాగునీరు అందుతుందని చెప్పారు. అదేవిధంగా వికారాబాద్ నియోజకవర్గంలో రూ. 600 కోట్లతో కొత్త రహదారుల నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు. ముఖ్యమంత్రి జిల్లాకు చెందినవారిగా ఉండటం, తాను స్పీకర్ హోదాలో ఉండటం వల్ల జిల్లాకు అధికంగా నిధులు లభిస్తున్నాయని పేర్కొన్నారు.
Share this article


