
అసెంబ్లీ ముట్టడి
Advertisement
హైదరాబాద్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.10 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని, రెండు లక్షల ఉద్యోగ నోటిఫికేషన్‌లు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య మాట్లాడుతూ, ప్రస్తుత బడ్జెట్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకు సంబంధించిన ఎలాంటి కేటాయింపులు లేకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కాలేజీలు ఫీజులు పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినప్పటికీ, విద్యార్థులపై పడుతున్న భారాన్ని తగ్గించే దిశగా ఆలోచించకపోవడం విద్యార్థి వ్యతిరేక విధానానికి నిదర్శనమని విమర్శించారు. స్కూల్ విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, పాలు, జావా అందించే పథకం కే. చంద్రశేఖర్ రావు ప్రభుత్వం ప్రారంభించిందని, అది కాంగ్రెస్ పథకం కాదని పేర్కొన్నారు. అలాగే ఈ బడ్జెట్‌లో విద్యానిధి పథకానికి ప్రస్తావన లేకపోవడం, రూ.5 లక్షల విద్యా రుణ హామీ ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. 18 సంవత్సరాలు నిండిన బాలికలకు స్కూటీ పథకం లేకపోవడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. రెండు లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రియాంక గాంధీ ప్రచార హామీలకు విలువ ఇవ్వని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్ విద్యాశాఖను నిర్లక్ష్యం చేసినదిగా చరిత్రలో నిలుస్తుందని, ఆ కీర్తి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు దక్కుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి రాష్ట్ర కమిటీ నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Share this article


