
మూసీ సుందరీకరణ కోసం భూసేకరణకు నోటిఫికేషన్లు
Advertisement
రాజేంద్రనగర్, ఫిబ్రవరి 24: మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ చేపడుతున్నట్లు రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్ రెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని కిస్మత్‌పూర్, దర్గా ప్రాంతాలకు సంబంధించిన భూసేకరణకు ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసినట్లు వెల్లడించారు. భూసేకరణ ప్రక్రియలో భాగంగా 500 మీటర్ల పరిధిలో ఉన్న నిర్మాణాలన్నింటిని స్వాధీనం చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. బండ్లగూడ జాగీర్, ఉప్పరపల్లి ప్రాంతాల్లో కూడా అవసరమైన నిర్మాణాలను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. మధు పార్క్ అపార్ట్‌మెంట్ బఫర్ జోన్‌లోనే ఉందని, 2004లో ఇది 12 మీటర్ల బఫర్ జోన్‌లో ఉండగా 2012లో బఫర్ జోన్‌ను 50 మీటర్లకు విస్తరించినట్లు చెప్పారు. అప్పటి అధికారుల అనుమతులతోనే ఆ అపార్ట్‌మెంట్ నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించి మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ను స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు. ప్రాజెక్టు అమలులో భాగంగా నిబంధనల ప్రకారం భూసేకరణ కొనసాగుతుందని ఆర్డీవో వెంకట్ రెడ్డి తెలిపారు.
Share this article


